ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు | tirumala brahmotsavalu special story | Sakshi
Sakshi News home page

ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు

Published Sun, Oct 2 2016 2:25 AM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు - Sakshi

ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు

తెలంగాణాప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చేనేత ఏరువాడ జోడుపంచెలు సమర్పించటం సంప్రదాయం. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ జోడు పంచెలు గద్వాల్ సంస్థానం నుండి కానుకగా అందే సంప్రదాయం నాలుగు వందల యేళ్ల నుండి నేటికీ కొనసాగుతుండటం విశేషం.  
 
ఏరువాడ జోడు పంచెలంటే?
ఏరు అంటే నదీపరివాహక ప్రాంతం అని అర్థం. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ నగరం పవిత్రమైన తుంగభద్ర, కృష్ణానది  మధ్య ఉంది. ఈ రెండు నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపై జోడుపంచెలు తయారు చేయటం సంప్రదాయం. అందుకే ఈ పంచెలు ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి పొందాయి.
 
గద్వాల సంస్థానాధీశుల వారసత్వం
గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం సంప్రదాయం. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు.
 
41 రోజుల పాటు దీక్షతో జోడు పంచెలు
గద్వాల సంస్థానాధీశుల విజ్ఞప్తి మేరకు ఐదేళ్లుగా గద్వాల లింగంబాగ్ కాలనీలోని  చేనేత పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కరుణాకర్ తన ఇంటిమీద తయారు చేశారు. వీటిని ఇప్పటికే సిద్ధం చేశారు.
* సాక్షాత్తు కలియుగ దేవదేవునికి అలంకరించే వ స్త్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మగ్గంతో ఐదుమంది సహచర చేనేత కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల షణ్ముఖ రావు, కరుణాకర్, మేడం రమేష్‌తో కలసి  సిద్ధం చేశారు.
* మొత్తం 41 రోజుల పాటు దీక్షతో ఈ జోడు పంచెలు తయారు చేశారు.
 
11 గజాల జోడు పంచెలు
గద్వాల ఏరువాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు ఉంటుంది. 15 అంగుళాల వెడల్పు అంచుతో తయారు చేశారు. ఈ జోడు పంచెలపై రాజకట్టడాల గుర్తుగా ఎనిమిది కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా తయారు చేశారు. ఒక్కోపంచెను తయారు చేయడానికి 20 రోజులు పడుతుంది.
 
బ్రహ్మోత్సవాల్లో మూలమూర్తికి అలంకరణ
గద్వాల సంస్థానం నుండి అందిన ఈ పంచెలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగానూ, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల సంస్థానానికి పంపటం తిరుమల ఆలయ సంప్రదాయం.
 
పూర్వజన్మసుకృతం
గద్వాల సంస్థానం ఆచారం ప్రకారం మా ఇంట్లో తయారైన జోడుపంచెలు సాక్షాత్తు తిరుమల గర్భాలయ మూలమూర్తి అలంకరణకు వాడుతుండటం మా పూర్వజన్మసుకృతం. ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించలేము.
- మహంకాళి కరుణాకర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement