భక్తులే సేవకులు | tirumala brahmotsavalu special story | Sakshi
Sakshi News home page

భక్తులే సేవకులు

Published Sat, Oct 1 2016 11:36 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

భక్తులే సేవకులు - Sakshi

భక్తులే సేవకులు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు భక్తులే సేవ చేసే మహద్భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. ‘శ్రీవారి సేవ’ పేరుతో 2000వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 195 మందితో ప్రారంభమైన ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో గతపదహారేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మందికి పైగా సేవకులు సాటి భక్తులకు విశేష సేవలందించారు.
 
స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు సాటి భక్తులే సేవలందించే మహదవకాశాన్ని శ్రీవారి సేవ పేరుతో టీటీడీ కల్పిస్తోంది.

సేవకులుగా నమోదు ఎలా చేసుకోవాలి?
శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకోవాలంటే నెల ముందుగా ‘ప్రజాసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానాలు, టీటీడీ పరిపాలనా భవనం, కె.టి.రోడ్, తిరుపతి-517501, ఫోన్ నంబరు: 0877-2264392’ చిరునామాకు లేఖ రాయాలి. పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ తరహాలో సాధారణ సేవకు కూడా ఆన్‌లైన్ నమోదు సౌకర్యం కల్పించారు.
 
నమోదు చేసుకున్న వారిని సేవకు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు (ప్రొసీడింగ్స్) కాపీతోపాటు దరఖాస్తు పత్రం పంపుతారు. లేదా మొబైల్ ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపుతారు.
 
డ్రెస్‌కోడ్: పురుషులు: తెలుపురంగు దుస్తులు - స్త్రీలు: మావిచిగురంచుతో కూడిన నారింజరంగు చీర, మావిచిగురంచు రవిక
 
శ్రీవారి సేవకులకు మార్గదర్శకాలు
శ్రీవారి సేవకుల వయస్సు 18 నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి  సేవకు వచ్చే వారి సేవకులందరూ ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (మెడికల్ సర్టిఫికెట్) కాపీ సమర్పించాలి  దరఖాస్తులకు పాస్‌పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు జత చేసి సేవాసదన్‌లో సమర్పించాలి  సేవకులకు కాషాయ రంగు స్కార్ఫ్‌లు అందజేస్తారు. విధుల్లో ఉన్నప్పుడు శ్రీవారి సేవ స్కార్ఫ్‌లు ధరించాలి. సేవాకాలం ముగిసిన వెంటనే వాటిని తిరిగి సేవాసదన్‌లో అప్పగించాలి  సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు.

కనీసం ఆరుగంటలపాటు సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి  బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల ముందే సేవకు హాజరై  శిక్షణ తీసుకోవాలి  ఎల్లప్పుడూ ‘గోవింద’ నామాన్ని స్మరిస్తూ, సాటి భక్తులను కూడా ‘గోవిందా, శ్రీనివాసా’ అని సంబోధించాలి  తిరునామం, తిలకం లేదా కుంకుమ, చందనం బొట్టు ధరించాలి  సాటి భక్తులలోనే స్వామివారిని దర్శిస్తూ అంకితభావంతో సేవ చేయాలి  శ్రీవారి సేవలో నిర్దేశించిన నియమ నిబంధనలు ఏదేని పరిస్థితుల్లో శ్రీవారి సేవకులు అతిక్రమిస్తే వారిని రెండేళ్ళ వరకు సేవకు అనుమతించరు  తిరుమలలోని ఆస్థానమండపంలో ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి సేవకులకు శిక్షణ తరగతులు జరుగుతాయి.
 
24 విభాగాల్లో శ్రీవారి సేవ: తిరుమలలో ప్రధానంగా 24 విభాగాల్లో సేవలందిస్తున్నారు. వీటిలో నిఘా, ఆరోగ్య, అన్నదానం, ఉద్యానవనాలు, వైద్య, లడ్డూప్రసాదం, శ్రీవారి ఆలయం, రవాణా, కళ్యాణకట్ట, పుస్తక విక్రయ శాలలతోపాటు మరికొన్ని ఉన్నాయి.
 అందించే సేవలివి:  టీటీడీ పరిపాలనలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ సేవ ఎంతో దోహదం చేస్తోంది  స్వామి దర్శనానికి వచ్చే క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులరద్దీని క్రమబద్ధీకరిస్తారు  క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్ల లో వేచి ఉండే భక్తులకు ఆహారం, మంచినీరు, పాలు, మజ్జిగ  పంపిణీ చేస్తారు  అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు  భక్తులు వెంట తెచ్చుకున్న లగేజీని, బ్యాగులను స్కాన్ చేస్తారు  ఉద్యానవన విభాగంలో పూలమాలలు తయారు చేస్తారు  పుస్తక విక్రయశాలల్లో పర్యవేక్షిస్తారు  దర్శన క్యూలైన్లు, వైద్యశాలల్లో వయోవృద్ధులకు, రోగులకు సహకరిస్తారు  ఉచిత చిన్న లడ్డూలు తయారు చేస్తారు  లడ్డూ టోకెన్లు మంజూరు చేస్తారు  వృత్తి నిపుణులైన వైద్యులు, ఇంజనీర్లు, మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇతర నిపుణులు అవసరమైనపుడు ఆయా విభాగాల్లో సేవలందిస్తున్నారు.
 
ఇతర సేవా విభాగాలు:
సాధారణ సేవతో పాటు టీటీడీ కొన్ని అర్హతలు, మార్గదర్శకాలు పాటిస్తూ పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ లాంటి ప్రత్యేక సేవలు ప్రవేశపెట్టింది.
 
పరకామణి సేవ: శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను పరకామణి సేవకులు లెక్కించాల్సి ఉంటుంది. 2012లో ప్రారంభించిన ఈ సేవలో 2016, జూన్ 23 వరకు 402 బృందాల్లో 42,558 మంది సేవలందించారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో లడ్డూ కౌంటర్లలో 2013, జనవరి 13న ప్రారంభమైన సేవలో 2016, జూన్ 23 వరకు 359 బృందాల్లో 18,014 మంది సేవలందించారు.
 
సేవకులకు టీటీడీ ప్రత్యేక వసతులు
బస:
పురుషులు, మహిళలు కలిపి మొత్తం 2300 మంది శ్రీవారి సేవకులకు బస ఉంది. శ్రీవారి సేవాసదన్‌లో సుమారు 700 మంది పురుష సేవకులకు, పీఏసీ-3లో 1600 మంది మహిళా సేవకులకు బస ఉంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, వైకుంఠ ఏకాదశి లాంటి రద్దీ రోజుల్లో 5000 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తారు. ఇందుకోసం అదనంగా పీఏసీ-2లో కొన్ని గదులను కూడా ఆ సమయంలో వినియోగిస్తారు. వారం రోజుల పాటు తోటి భక్తులకు సేవ చే స్తే ఎనిమిదోరోజు సుపథం మార్గం గుండా శ్రీవారి ఉచిత దర్శనం కల్పించి, రాయితీపై లడ్డూలు అందజేస్తారు.  
 
తిరుపతిలో శ్రీవారి సేవ
2014, మార్చి7న తిరుపతిలోని విష్ణునివాసం వసతిగృహంలో శ్రీవారి సేవ కార్యాలయం ప్రారంభించారు  ఇప్పటివరకు 49,988 మంది శ్రీవారి సేవకుల సేవలందించారు. తిరుపతిలో మూడు షిప్టుల్లో శ్రీవారి సేవకులకు సేవావిధులు నిర్వహించాలి  టీటీడీ స్థానిక ఆలయాలతోపాటు అన్నప్రసాదం, గోసంరక్షణశాల, మార్కెటింగ్ విభాగం, కేంద్రీయ వైద్యశాల, రిసెప్షన్ విభాగం, విష్ణు నివాసంలో ఎస్కలేటర్ వద్ద సేవలందిస్తున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, కోదండరామాలయం, లక్ష్మీనారాయణస్వామి ఆలయం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేవలందిస్తున్నారు.   
 
శ్రీసత్యసాయి సేవాసమితి శిక్షణ:  శ్రీవారి సేవకుల్లో సేవానిరతి, ధర్మచింతన మరింతగా పెంచడం ద్వారా భవిష్యత్తులో వారిని హిందూ ధర్మ రథసారథులుగా తీర్చిదిద్దాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తిలో అత్యున్నత ప్రమాణాలతో భక్తులకు సేవలందిస్తున్న శ్రీసత్యసాయి సేవాసమితి సహకారంతో  తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవకులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ సమయంలో  ధ్యానం, భజన, 30 నిమిషాలపాటు ‘సేవ’ ప్రాశస్త్యంపై తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఉపన్యాసం ఉంటుంది. సేవకులు భక్తులతో మెలిగే విధానం, తిరుమలలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర విషయాలపై శిక్షణ ఇస్తున్నారు  టీటీడీలో విభాగాలవారీగా అందించాల్సిన సేవలపై టీమ్ లీడర్లకు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆ టీమ్ లీడర్లు గ్రూపులోని  సేవకులకు అవగాహన కల్పిస్తారు.
 
రూ.70 కోట్లతో సేవాసదన్: తిరుమలలో సుమారు 4 వేల మంది సేవకులకు బస కల్పించేలా రూ. 70 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో త్వరలో శ్రీవారి సేవాసదన్ నిర్మించనున్నారు.
 
వీఐపీలూ శ్రీవారి సేవకులే!
శ్రీవారి సేవలో సాధారణ భక్తులే కాకుండా వీఐపీలు కూడా పాలు పంచుకున్నారు. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, జస్టిస్ ఈశ్వరయ్య, సినీహీరో చిరంజీవి కుటుంబ సభ్యుల వంటి వివిధ రంగాలకు చెందిన ఎందరెందరో దిగ్గజాలు శ్రీవారి సేవలో పాల్గొని సాటి భక్తులకు సేవ చేశారు.
 
ఈ సేవలను మరింతగా విస్తరిస్తాం..!
భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇందులో రైతులు, వ్యాపారులు, యువత, మహిళలు, ఇంజనీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, బ్యాంకర్లు... ఇలా ఎవరికి వారు స్వామి సన్నిధిలో ఏడు రోజుల పాటు సాటి భక్తులకు సేవచేసి అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నారు. పదహారేళ్లకాలంలో ఏడున్నర లక్షలమంది స్వచ్ఛందంగా భక్తులు సేవ చేసిన ఘనత టీటీడీకే దక్కింది. ఈ స్వచ్ఛంద సేవాకార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని సంకల్పించాము.
 - కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుమల జేఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement