– శాస్త్రోక్తంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
– ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన సేనాపతి విష్వక్సేనుడు
– నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం
– శ్రీవారికి పట్టువస్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరపున విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుక నిర్వíß ంచడం అనాదిగా వస్తున్న ఆచారం.
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవే„ì స్తూ తిరిగి ఆలయంలోనికి చేరుకున్నారు. యాగశాలలో లలాట, బహు, స్తన పునీత ప్రదేశంలో భూమి పూజ(మృత్సంగ్రహణం) నిర్వహించారు. తొమ్మిది పాళికలలో(కుండలు)– శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు.. మొదలగు తొమ్మిది రకాల నవధాన్యాలు మొలకొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం (బీజావాపం) అంటారు. ఈ కార్యక్రమానికి సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. ఉత్సవాలు విజయవంతం కావాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. తర్వాత రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇలా వరుసగా ఈనెల 11వ తేది వరకు ఉదయం 9 నుంచి 11 గంటలు , రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ సాక్షాత్కరించనున్నారు. ఐదోరోజు రాత్రి 7.30 గంటలకే గరుడ వాహనం స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఇక ఎనిమిదో రోజు రథోత్సవంలోనూ, చివరి తొమ్మిదో రోజు చక్రస్నానంలో స్వామివారు సేద తీరుతారు.
నేడు శ్రీవారికి సీఎం పట్టువస్రాలు సమర్పణ
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక్కడి సీఎం బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేషవాహనసేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు.
శ్రీవారి ఆలయం గుభాళింపు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. మహద్వారం నుంచి గర్భాలయం వరకు సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలు, దేదీప్యమాన విద్యుత్ అలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల కోసం బందోబస్తు సిబ్బంది తిరుమలకు చేరుకున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.