తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక, వీఐపీ దర్శనం, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అలాగే 18వ తేదీన గరుడ సేవ, 22వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమంతో ఉత్సవాలు అంకురార్పణ జరగనుంది. ఈ వేడుకలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. అందులోభాగంగా మంగళవారం సాయంకాల వేళలో విష్వక్సేనుడు ఆలయ పురవీధుల్లో ఊరేగుతారు. అనంతరం యాగశాలలో భూమిపూజ చేస్తారు. 9 పాళికలలో నవధాన్యాలతో అంకురార్పణ చేస్తారు.