
వికాస కేంద్రాలుగా విదేశీ ఆలయాలు
ఆలయ సంస్కృతి ఒక్క భారత దేశంలోనే కాకుండా ఖండాంతరాలలో వ్యాపించి సమస్త మానవాళికి సంజీవనిగా వెలుగొందుతోంది. లోకకల్యాణం కోసం దే శదేశాల్లో కూడా ఆలయాలు విస్తరిస్తూ అక్కడివారిలో ప్రేమామృతాన్ని పంచే ఆధ్యాత్మిక కేంద్రాలుగా బాసిల్లుతుండటం విశేషం.
దక్షిణభారత దేశ శిల్పరీతుల్లో శ్రీమహావిష్ణువు అంశలైన శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడుతోపాటు కుమారస్వామి (మురుగన్), వినాయకుడు, శివపార్వతులు, ఆంజనేయస్వామి, నవగ్రహాల ఆలయాలు అధికంగా కనిపిస్తాయి. వీటితోపాటు ఉత్తర భారతదేశ శిల్పరీతుల్లో ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలు, స్వామినారాయణ్ ఆలయాలు విదేశాల్లో ఉన్నాయి.
నాటి శిల్పకళా వైభవ రీతులకు దర్పం
అలనాటి కళింగ, చోళ, పల్లవ, పాండ్య, కాకతీయ రాజుల నాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీకలుగా నిలిచిన శిల్పకళా నిర్మాణం రీతుల్లోనే విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించారు. వైష్ణవ, శైవ ఆగమ రీతులకు లోబడి పునాది నుంచి విమానప్రాకారం వరకు అన్నీ ఆగమ శాస్త్ర, వాస్తు సంబంధంగానే నిర్మించారు.
నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా గర్భాలయం, శయన మండపం, ముఖమండపం, ప్రాకారాలు, ధ్వజ స్తంభం, పుష్కరిణి వంటివి తప్పక ఏర్పాటు చేయటం విశేషంగా చెప్పవచ్చు.
ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ప్రత్యేకంగానూ, ఒకే భవంతిలో వివిధ అంతస్తుల్లోనూ వివిధ దేవతా మూర్తులను ఆగమోక్తంగా ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.
విదేశాల్లో సమాజ హిత కేంద్రాలుగా...
* విదేశాల్లోని ఆలయాల్లో కేవలం పూజలు, ఉత్సవాలే కాకుండా సమాజ హితం కోసం అనేక ఆధ్యాత్మిక, కళా, సాంస్కృతిక, నైతిక, సామాజిక, విద్య, ఆరోగ్య, మానసిక వారధులుగా ఆలయాలు పనిచేస్తున్నాయి.
* ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ వంటి ఆధ్యాత్మికవేత్తల మరెందరితోనూ తరచు ఆధ్యాత్మిక, వేదాంతిక ప్రసంగాలు, ప్రవచనాలు చేయిస్తూ అక్కడి జనంలో తాత్విక చింతన, భక్తి, ప్రేమ తత్వాన్ని పెంపొందిస్తున్నారు.
* ప్రత్యేకించి సెలవురోజుల్లో యోగా శిక్షణా తరగతులు నిర్వహించి మానసిక రుగ్మతలను, ఎన్నో దీర్ఘకాలిక జబ్బులను నియంత్రిస్తుంటారు.
* సనాతన భారతీయ నృత్య, సాంస్కృతిక సంపదలైన కూచిపూడి, భరతనాట్యం, ఆలయ భజన, హరికథ వంటి ఎన్నో భక్తి, సంగీత కళాసంప్రదాయాల్ని నేటి తరానికి అందించటం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* హెల్త్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్ర ద్ధ కనబరచేలా విలువైన సూచనలు ఇచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్య పరుస్తారు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఆలయాల వద్ద తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ మొదలగు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మాతృభాషను బోధిస్తారు.
* ప్రత్యేకంగా ధ్యానంపై శిక్షణ ఇచ్చి మానసిక స్వాంతన చేకూరుస్తారు. ఆలయాల్లో ఆడిటోరియం, లైబ్రరీ, డైనింగ్ హాలు, మీడియా సెంటర్ ఏర్పాటు చేసి నిత్యం అనుకూల వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ట్రస్టీల చేతుల్లో ఆలయ నిర్వహణ
* విదేశాల్లోని ఆలయాలు దాదాపుగా ట్రస్టీల చేతుల్లో నిర్వహింపబడుతున్నాయి. నిర్ణీత గడువులో జరిగే ఎన్నికల్లో ట్రస్టీలను ఎన్నుకుంటారు. ఏడాదికి సరిపడా కార్యక్రమాలు రూపొందించి పక్కాప్రణాళికతో అమలు చేస్తారు.
* భక్తులకు సలహాలు, అన్నదానం, ఆర్థిక సంబంధ విషయాలు, హిందూధర్మ పరిరక్షణ, మానవతా విలువల్ని సంరక్షించటం, గ్రంథాలయాల్లో శాస్త్రగ్రంథాలు సమకూర్చటం, మానవసంబంధాలు కొనసాగించటం, సామాజిక సేవాకార్యక్రమాలు వంటివి నిర్వహిస్తారు.
విదేశాల్లోని ఆలయాల్లో ఏడాది పొడవునా ఉత్సవాలు
* విదేశాల్లోని ఆలయాలు సాధారణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు, పూజలు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక, కాలపట్టికను సిద్ధం చేసుకుంటాయి. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి.
* ప్రతి ఏడాది దసరా నవరాత్రుల్లోనూ, కార్తీక మాసంలోనూ స్వామివారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వాహన సేవల్ని, రథం ఊరేగింపు, చక్రస్నానం కూడా నిర్వహిస్తారు.
* అలాగే మకర సంక్రాంతి, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, కృష్టాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి, మహాశివరాత్రి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. కృష్ణుని జీవితంలోని ప్రధాన ఘట్టాలైన రాధామాధవ రాసలీల, గోవర్ధనగిరిని తన చిటికనవేలితో ఎత్తటం, అలనాడు పూతనను సంహరించటం వంటి ప్రధాన ఘట్టాలు కళ్లకు కట్టే విధంగా కళాప్రదర్శనలు ఇవ్వటం ద్వారా నేటితరాలకు నాటి భక్తితత్వాన్ని, ఆధ్యాత్మికత అమృతసారాన్ని నాటి తరం నుంచి నేటితరానికి అందిస్తుండటం ముదావహం.
స్వామినారాయణ్, ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల సందడి
* ఉత్తర భారత దేశ సంస్కృతిలో భాగంగా అంతర్జాతీయంగా స్వామి నారాయణ్ ఆలయాలు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌కు చెందిన రాధాకృష్ణమందిరాలు ఎక్కువ దేశాల్లో విస్తరించాయి.
విదేశీ ఆలయాల్లో టీటీడీ శ్రీనివాస కల్యాణాలు
* ఖండాంతరాల్లోని ప్రవాస భారతీయ భక్తులకూ స్వామి వైభవాన్ని చాటేలా ‘శ్రీనివాస కల్యాణం’ నిర్వహిస్తూ వారిలో భక్తి చైతన్యాన్ని నింపుతోంది టీటీడీ. పంచలోహ విగ్రహ మూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామికి తిరుమల ఆలయ తరహాలోనే స్వామి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. ఈ పంచలోహ విగ్రహాలను టీటీడీ తయారు చేసి నిర్వాహకులకు నగదుపై ముందుగానే అందజేస్తుంది.
మహ్మదీయుల నాదస్వరార్చన
ప్రపంచ నాదస్వర చక్రవర్తిగా ప్రఖ్యాతి గాంచిన పద్మశ్రీ షేక్ చినమౌలానాకు శ్రీవారి ఆలయంతో అపారమైన అనుబంధం ఉంది. ఆలయంలో అనేక కైంకర్య కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాల్లో నాదస్వర కచ్చేరి చేసేవారు మౌలానా. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో నాద నీరాజనంతో స్వామిని స్తుతించారు. అలాంటి విద్వాంసుడి ఏకైక కుమార్తె వీవీ జాన్ బిడ్డలైన మనుమలు షేక్ ఖాసిం, షేక్ బాబులు తాతగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తిరుమలేశుని ఆలయ నాదస్వర విద్వాంసులుగా సేవలు అందిస్తూ మత సామరస్యాన్ని చాటుతుండటం విశేషం.
తాత చలవతోనే వెంకన్న సేవాభాగ్యం
‘‘మా తాత మౌలానా గారు ప్రపంచ నాదస్వర చక్రవర్తి. మాకు చిన్నతనంలోనే నాదస్వరంలో నడకలు నేర్పారు. ఆ సంగీత సమ్రాట్ నేర్పిన నడకల వల్లే నేడు శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలిగింది. మతాలకు అతీతంగా వెంకన్నసేవలో తరిస్తున్నాం. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. ఇది పూర్వజన్మసుకృతం. ’’
- షేక్ ఖాసిం, షేక్ బాబు, నాదస్వర విద్వాంసులు, అన్నదమ్ములు
వారి సేవ అనిర్వచనీయం
పద్మశ్రీ షేక్ చినమౌలానా మనమలు షేక్ ఖాసిం, షేక్ బాబు సేవ అనిర్వచనీయం. స్వామివారి ఉత్సవాల్లో విధిగా పాల్గొని తమ జ్ఞానవిద్య, సంగీత విద్యను స్వామికి సేవా రూపంలో అందిస్తూ కొలుస్తున్నారు. ఆ కుటుంబంపై స్వామి వారి కృప ఎల్లవేళలా ఉంటుంది.
- డాక్టర్ కేవీ రమణాచారి, టీటీడీ పూర్వపు ఈవో
షేక్ హుస్సేన్ అనే భక్తుడు భక్తిశ్రద్ధలతో సమర్పించిన 108 బంగారు పుష్పాలతోనే ప్రతి మంగళవారం గర్భాలయంలోని మూలమూర్తికి అష్టదళ పాద పద్మారాధన, ప్రత్యేక వారపు సేవ చేస్తుండటం విశేషం.