లడ్డూ మాధుర్యానికి 75 ఏళ్లు
అమృత పదార్థంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూ అమృతోత్సవాన్ని పూర్తి చేసుకుంది. మాధుర్యంలో సాటిలేని లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికీ, ఆయన భక్తజనకోటికీ కూడా ప్రీతిపాత్రమైనది.
1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించిన ట్టు చారిత్రక ఆధారం. అప్పటినుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారట. తొలుత పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర. అప్పట్లోనే శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.
ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాదు. దాంతో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది.
1940 నుంచే భక్తుల చేతికి లడ్డూ
1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచారు. 1940 నుంచి బూందీని లడ్డూగా మార్చి భక్తులకు అందజేయటం ప్రారంభించారు. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అనే పేరుతో పిలుస్తారు. 1950లో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఈ దిట్టం పరిమాణాలను ఖరారు చేసింది. ఆలయ అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు.
ఒక లడ్డూ తయారీకి...
భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీకి టీటీడీ రూ.30 దాకా ఖర్చుపెడుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా 2015లో లెక్కలు వేశారు. ఇందులో భాగంగానే ఆలయ పోటులో దిట్టం ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకు వినియోగిస్తారు. ఇందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తారు. ఆలయంలో నిత్యం 900 కేజీల ఆవునెయ్యి లడ్డూల తయారీకే వాడతారు. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు దక్కించుకోవటంలో 2009లో అప్పటి ఈవో కేవీ రమణాచారి కృషి చేశారు.
రాయితీలడ్డూలపై రూ.60 కోట్లు
భక్తుల కానుకలతో ధార్మిక సంస్థ మనుగడ సాగిస్తోంది. అదే భక్తులకు అందజేసే ఉచిత, రాయితీ ధరలతో ఇచ్చే లడ్డూల వల్ల ఏటా రూ.60 కోట్ల వ్యయాన్ని టీటీడీ భరిస్తోంది. నాలుగేళ్లకు ముందు సర్వదర్శనం, కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులు, అంగప్రదక్షిణం, వికలాంగులు, వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చే తల్లిదండ్రులు, శ్రీవారి సేవకులకు రూ.10 రాయితీ ధరతో రూ.20కి రెండు లడ్డూల చొప్పున అందిస్తున్నారు. ఇలా ఏటా సుమారుగా రూ.40 కోట్ల వరకు అదనంగా టీటీడీ ఖర్చు చేస్తోంది. ఇక సర్వదర్శనం, కాలిబాట దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందిస్తుండటం వల్ల మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది.
లడ్డూ తయారీకి రోజుకు 900 కిలోల ఆవునెయ్యి వాడతారు. ఆవునెయ్యిని ఆలయం వెలుపల ఉన్న ఎనిమిది భారీ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. పైపులైను ద్వారా నెయ్యిని ఈ ట్యాంకుల నుంచి పోటుకు సరఫరా చేస్తారు. ఇవి చాలకపోవడం వల్ల మరికొన్ని ట్యాంకులు సిద్ధం చేశారు.