
ఆనంద నిలయం అఖండ తేజోమయం
తనమీద అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వీడిన విష్ణుమూర్తి భూలోక వైకుంఠమైన వేంకటాచల క్షేత్రానికి విచ్చేశాడు. అక్కడ స్వయంవ్యక్త సాలగ్రామ శిలామూర్తిగా వెలసి భక్తకోటిని కటాక్షిస్తున్నాడు. స్వామి కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనంద నిలయం. గర్భాలయంపై నిర్మించిన బంగారు గోపురమే ‘ఆనంద నిలయ విమానం’గా ప్రసిద్ధి పొందింది.
‘వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన
వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’’
శ్రీవేంకటేశ్వరస్వామి వారు గర్భాలయంలో ‘ఉపధ్యక’ అనే పవిత్రస్థానంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వాటినే ధ్రువమూర్తి, మూలమూర్తి, మూలవిరాట్టుగా కొలుస్తారు. యోగ, భోగ, విరహ రూపాలతోపాటు ‘వీర స్థానప’ విధానంలో నిలబడిన స్వామి ముగ్ధమనోహరంగా ప్రకాశిస్తాడు. స్థిరంగా ఉంటాడు. ఈ విగ్రహాన్నే ఆగమ పరిభాషలో ధ్రువబేరంగా సంబోధిస్తారు.
సుప్రభాతంతో వేకువజామున 2.30 గంటలకు స్వామిసేవను ప్రారంభించి, తిరిగి రాత్రి 12.30 గంటలకు జోలపాటతో నిద్రపుచ్చుతారు. వైఖానస ఆగమబద్ధంగా తోమాల, అర్చన, కొలువు ఇతర నిత్యసేవా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో మూడుపూట లా అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తూ అర్చకులు లోకకల్యాణం కోసం శరణు వేడుతారు.
పుష్పకైంకర్యంలో భాగంగా సాలగ్రామ హారాలు, శిఖామణి, శంఖుచక్రం, శ్రీదేవి, భూదేవి కంఠహారాలు, అలంకార బిట్లు, 25 రకాల పూలకుచ్చులతో కూడిన సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పుష్పకైంకర్యాలు చేస్తారు. నిత్య దిట్టం కింద 300 కేజీల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, ఆస్థాన కార్యక్రమాల కోసం 10 నుంచి 20 టన్నుల వరకు పుష్పాలు వినియోగిస్తారు.
తననే శరణు వేడండంటూ కటి, వరదహస్తాలతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ భక్తులకు హెచ్చరికతో కూడిన హితబోధ చేస్తూ దర్శనమిస్తుంటారు. అలాంటి దివ్యమైన బంగారు పాదాలను నిత్యం పుష్పాలు, తులసి సేవిస్తుంటాయి. వేకువజాము సుప్రభాత దర్శనంలో మాత్రమే తులసి, పుష్పాలు లేకుండా దర్శించవచ్చు. ఇక శుక్రవారం అభిషేకం, ఆ తర్వాత దర్శన సమయంలో మాత్రమే బంగారు పాద తొడుగులు లేకుండా స్వామి పాద పద్మాలు (నిజపాద సేవలో) దర్శించవచ్చు.
ప్రతి రోజూ నిత్యకట్ల అలంకారంలో 120 రకాల ఆభరణాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో ప్రత్యేక అలంకారాలు చేసేందుకు అదనంగా ఆభరణాలు వాడతారు. రోజూ చేసే అలంకారాన్ని నిత్య కట్ల అలంకారమని, పండుగలు, ఉత్సవాలు, ప్రముఖుల రాక సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారమని అంటారు. స్వామికి వజ్రకిరీటం, శంఖ, చక్ర, వరద హస్తాలు, ప్రత్యేక ఆభరణాలతో శోభాయమానంగా అలంకరిస్తారు.
శ్రీ స్వామి, ఉత్సవమూర్తుల అలంకరణలకు వాడే కిరీటాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, ఇతర నిల్వలు దాదాపుగా 11 టన్నులు ఉంటాయి. వీటితోపాటు వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాల నగ లు కూడా ఉన్నాయి.
ఆకాశరాజు కిరీటం, వేంకటాద్రిని పాలించిన రాజులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, భక్తులు సమర్పించే కానుకల వివరాలను నమోదు చేసేందుకు టీటీడీ 19 తిరువాభరణ రిజిస్టర్లు నిర్వహిస్తోంది.
శుక్రవారం అభిషేకం తర్వాత స్వామికి ఊర్ధ్వపుండ్రాలు (తిరునామం) సమర్పిస్తారు. దీనినే ‘తిరుమామణికాపు’ అంటారు. ఇందుకోసం 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భాల్లో తిరుమానానికి వాడే ద్రవ్యాలు రెట్టింపు స్థాయిలో వాడతారు.
అభిషేకం తర్వాత మూలమూర్తికి అంతరీయం (ధోవతి)గా 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగా ధరింప చేస్తారు. విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ఇతర సామాజ్య్రాలపై దండయాత్రకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సందర్భంగా విలువైన ఆభరణాలు, కిరీటాలు, ఖడ్గాలను బహూకరించాడు. మలయప్పకు అలంకరించే గుండ్రని కిరీటం, మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఉత్సవాల్లో ఎదపై అలంకరించే పెద్ద పచ్చ రాయలు సమర్పించినవే.
ఆలయంలోని జయవిజయలు ఉన్న బంగారువాకిలి దాటుకున్న తర్వాత రాములవారి మేడలో ఉండే రహస్య అలమరాలో శ్రీవారికి వినియోగించే ఆభరణాలు భద్రపరుస్తారు. వీటిని ఆలయ డిప్యూటీ ఈవో, పేష్కార్ పర్యవేక్షిస్తారు. ఏ రోజు, ఏ ఉత్సవంలో ఏయే ఆభరణాలు అవసరమో అర్చకుల సూచన మేరకు వాటిని సమకూరుస్తారు.
శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసుడు కొలువై ఉన్నారు.
పంచమూర్తులే కాకుండా సుదర్శన చక్రత్తాళ్వార్, సీతారామ లక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వంటి పంచలోహ మూర్తులు కూడా గర్భాలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడే దేవతామూర్తులతోపాటు పవిత్ర సాలగ్రామాలు కూడా నిత్య పూజలందుకుంటున్నాయి. గర్భాలయానికి ఆగ్నేయం, ఈశాన్య దిశల్లో అటు ఇటుగా ‘బ్రహ్మ అఖండం’ నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ దీపాలను వెలిగించాడని విశ్వాసం.
రాత్రి పవళింపు సేవ చివరి సమయంలో బంగారు నవారు పట్టె మంచంపై ‘మనవాళ పెరుమాళ్’ (భోగశ్రీనివాసుడు)ని వేంచేపు చేస్తారు. అదే సమయంలోని గర్భాలయ మూలమూర్తికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి ‘ముత్యాల హారతి’ మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తారు.
తెలుగు నూతన సంవత్సరాధి పర్వదినమైన ఉగాది (మార్చి/ఏప్రిల్), ఆణివారి ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం (సెప్టెంబరు/అక్టోబరు), వైకుంఠ ఏకాదశి (డిసెంబరు/జనవరి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తారు. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం రోజున ఆనంద నిలయం నుంచి మహాద్వారం వరకు శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో నీరు, దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు మూలమూర్తి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళ వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రాన్నే ‘మలైగుడారం’ అని అంటారు. తిరుమంజన సేవలు పూర్తకాగానే కురాలం అనే దీర్ఘచతురస్రాకారపు మఖమల్ వస్త్రాన్ని పైకప్పునకు కడతారు.
గర్భాలయంలో కేవలం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న దుమ్ముదూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే ఎక్కువ మోతాదులో నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ కిచిలిగడ్డ ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారు చేస్తారు. భారీ గంగాళాల్లో సిద్ధం చేసిన ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనంగా పూస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు క్రిమికీటకాలు ఉండకుండా ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.