
తెల్లదొరలూ... వెంకన్న సేవకులే
రెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులే. ఆ మాటకొస్తే ఆలయ పాలనా పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయి. దేవస్థానం రికార్డులే అందుకు ఆధారం.
1801 నుండి 1843 వరకు బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా పాలకుల హయాంలోనే ఆలయ పాలనకు కఠిన నిబంధనలు, క్రమశిక్షణ పద్ధతులు అమలయ్యాయి. నేటికీ తిరుమల ఆలయం, టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది 1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్ ఈస్టిండియా కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు.
క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు.
టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు
దిట్టం: శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాల తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు.
కైంకర్యపట్టీ: తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీ దారులు, జియ్యర్ సిబ్బంది విధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చే శారు. దీనిప్రకారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి.
బ్రూస్‌కోడ్: బ్రిటీష్ ప్రావిన్షియల్ జడ్జి పి.బ్రూస్ ఈస్టిండియా కోడ్ ఆఫ్ డెరైక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికీ ఆలయపాలనకు అదే దిక్సూచీగా ఉంది.
సవాల్- ఇ-జవాబు: శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలువేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే సవాల్- ఇ-జవాబు పట్టీగా పిలుస్తారు.
పైమేయిషి ఖాతా: ఆలయ స్థిర, చరాస్తులు, దేవతావిగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషి అకౌంట్’ అని పిలుస్తారు. ధార్మికసంస్థ పరిపాలనలో రికార్డులు, విధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది.
జీవో ఎంఎస్ నెంబరు 4429 తేది:23.09.1940, జీవో ఎంఎస్ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చ.కి.మీ. పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్లదొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండటం వారి పాలనాదక్షతకు నిదర్శనం.
సాక్షి, ఫన్‌డే కవర్‌పై ముద్రించిన శ్రీ వేంకటేశ్వరస్వామి బంగారు ఆభరణాల చిత్రం తయారీకి టీటీడీ ఆభరణాల నుండే విడి భాగాల చిత్రాలను సేకరించి రూపొందించడమైనది.
కవర్-బుక్ డిజైన్: కుసుమ