
వెంకన్నకు విరాళాల వెల్లువ
టీటీడీకి విరాళాలు ఇచ్చే దాతలకు భారత ప్రభుత్వ ఆదాయపన్ను చట్టం 80(జీ) కింద పన్ను మినహాయింపు కూడా ఉండటంతో విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ అధినేత విజయ్‌మాల్యా 1980లో శ్రీవారి ఆలయ తిరుమామణి మండపానికి బంగారు తాపడం చేయించారు. పారిశ్రామిక దిగ్గజాలైన రతన్‌టాటా, అనిల్ అంబానీ తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ప్లాస్మా టీవీలు, ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయించారు. ముఖేష్ అంబానీతోపాటు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని భక్తులెందరో శ్రీవారికి ఆభరణాలను తయారు చేయించారు.
2008లో పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి రూ.5 కోట్ల విలువగల మేలిమి వజ్రాలు పొదిగిన క టి, వరద హస్తాలను స్వామికి సమర్పించారు. తర్వాత కొత్తగా నిర్మించిన తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవన సముదాయానికి వంటసామగ్రి, ఫర్నిచర్‌ను విరాళంగా సమర్పించారు. 2009లో గాలి జనార్దన్‌రెడ్డి సుమారు రూ.45 కోట్లు విలువైన వజ్ర కిరీటాన్ని బహూకరించారు. ఆయన సోదరుడు గాలి కరుణాకరరెడ్డి గర్భాలయ మూలమూర్తికి బంగారు పాద తొడుగులు సమర్పించారు. టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటిరూపాయలు విరాళంగా ఇచ్చారు. సుమారు రూ.1 కోటి విలువైన సూర్యప్రభ వాహనాన్ని నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా సమర్పించారు. 2010లో రూ.4 కోట్లతో కల్యాణవేదిక నిర్మించారు. అలాగే ఆలయ ప్రాకారాన్ని స్వర్ణతాపడం చేయించడం కోసం మొత్తం 113 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా గణపవరంకు చెందిన ప్రవాస భారతీయుడు అనంత కోటిరాజు రూ.20 కోట్ల విరాళంతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవన సముదాయాన్ని నిర్మించారు. రూ. 5 కోట్ల ఖర్చుతో తిరుమలలో పరిశుద్ధమైన నీటిని సరఫరా చేస్తున్నారు కోటిరాజు. 2013 ఏప్రిల్‌లో ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు రూ.16.65 కోట్లు విరాళం ఇచ్చారు. టీటీడీ చేపట్టే కార్యక్రమాలకు దాతలు ఆజ్ఞాతంగా ఇచ్చే విరాళాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
1500 టన్నుల కూరగాయల విరాళం
నిత్యాన్నదాన ట్రస్టు ద్వారా రోజూ భోజనానికి అవసరమైన 3.5 టన్నుల కూరగాయల్ని వితరణ రూపంలో భక్తులే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.1 కోటి పైబడిన 120 నుంచి 150 టన్నుల కూరగాయలు పంపుతున్నారు భక్తులు. మైసూరుకు చెందిన మంజులా సౌందర్ రాజన్, చెన్నయ్‌లోని అనంతకృష్ణన్, వేలూరులోని కనకస్వామి, బెంగళూరులోని కుమార స్వామి, వేలూరులోని చంద్రన్, చిక్కబళ్లాపూర్ చంద్రశేఖర్, మదనపల్లి రవి, విజయవాడకు చెందిన కుటుంబరావు కూరగాయలు అందజేస్తున్నారు.
పుష్పకైంకర్యంలోనూ భక్తుల వితరణ
తమిళనాడు సేలంలోని నిత్యపుష్పకైంకర్య ట్రస్టు, బె ంగుళూరులోని ఓం శ్రీ సాయిఫ్లవర్స్, హైదరాబాద్ శ్రీధర్ అండ్ గ్రూప్, బెంగుళూరులోని ఫాంహౌస్ అసోషియేషన్స్, మంత్రి దానం నాగేందర్, ఈరోడ్‌లోని శ్రీ సేవ ట్రస్టు, కరూర్‌లోని రమేష్‌బాబు పుష్పకైంకర్యంలో ప్రధాన దాతలు. వీరితోబాటు మరెందరో భక్తులు స్వామివారికి పుష్పకైంకర్యం చేయిస్తున్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక కథనాలు
సహదేవ కేతారి సాక్షి, తిరుమల
ఫొటోలు
కె.మోహనకృష్ణ
సాక్షి, తిరుమల
కొన్ని ఫొటోలు,
సమాచార సౌజన్యం: టీటీడీ ప్రజా సంబంధాల విభాగం