వెంకన్న దర్శనానికి ట్యాక్స్ కట్టాల్సిందే
తిరుమలేశుని జీఎస్టీ పెను భారం
- టీటీడీ ఏటా రూ.472 కోట్ల ముడిసరుకుల కొనుగోళ్లు.. దీనిపై మరో రూ.50 కోట్లు పైబడి భారం
- రాబడి వసూళ్లపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తే టీటీడీపై మరింత ప్రభావం
- ఇప్పటికే ఉచిత, సబ్సిడీ లడ్డూ, అన్నప్రసాదం వితరణ అమలుతో ధార్మిక సంస్థ సతమతం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతున్నారా? గది కావాలా? దర్శనం టికెట్టు కావాలా? అయితే ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉండండి. జూలై ఒకటో తేదీ నుండి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానం ఈ కొత్త నిర్వచనాన్ని ఎత్తిచూపుతోంది. దేశంలోనే అతిపెద్ద హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పెనుభారం మోపనుంది. ఇప్పటికే ఉచిత, సబ్సిడీ లడ్డూ, నిత్యాన్నప్రసాద వితరణతో ఆర్థిక భారాన్ని మోస్తున్న ధార్మికసంస్థపై కొనుగోళ్లు, రాబడి వసూళ్లపై జీఎస్టీ భారం మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
వ్యాట్ మినహాయింపు.. జీఎస్టీ బాదుడు
2003లో అమల్లోకి వచ్చిన వ్యాట్ పన్ను చట్ట ప్రకారం మతపరమైన ధార్మిక సంస్థలకు మినహాయింపు వచ్చింది. సుప్రీంకోర్టు విధి విధానాల ప్రకారం ఆయా రాష్ట్రాలు అమలు చేసే వ్యాట్ చట్ట పరిధిలో ధార్మిక సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. దీంతో ఆయా క్షేత్రాల్లో భక్తులు చేసే లావాదేవీలకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ జీఎస్టీలో మత పరమైన సంస్థలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. కేవలం ప్రసాదాల అమ్మకం మినహా ఇతర రాబడి వసూళ్లపై పన్నుభారం మోయకతప్పదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.
శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.50 సుదర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, రూ.500 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల అమ్మకం ద్వారా టీటీడీకి ఏటా రూ.256 కోట్లు (2016–2017), ఆర్జిత సేవా టికెట్ల ప్రకారం రూ.55 కోట్లు (2016–2017) లభిస్తోంది. టీటీడీ పరిధిలో తిరుమలలో ఏడు వేలు, తిరుపతిలో మరో వెయ్యిదాక కాటేజీలు, అతిథిగృహాలు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా రూ.124 కోట్లు (2016–2017) ఆదాయం లభిస్తోంది. ఇక ఏటా 1.2 కోట్ల మంది భక్తులు సమర్పించిన తలనీలాల అమ్మకం ద్వారా మరో రూ.100 (2016–2017) కోట్లు రాబడి వస్తోంది. ఇకపై వీటన్నింటిపై జీఎస్టీ పన్ను భారాన్ని టీటీడీ భరించకతప్పదు.
ఏటా రూ.472 కోట్ల కొనుగోళ్లు
శ్రీవారి దర్శనం కోసం సరాసరిగా రోజూ 80 వేల పైబడి భక్తులు వçస్తున్నారు. వీరికి బస, దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం వంటివి సమకూర్చాల్సి ఉంది. ఇందులో భాగంగా దేవస్థానం మార్కెటింగ్ శాఖ రూ.472కోట్లు ( 2016–2017 ఆర్థిక సంవత్సరం) మేర ముడిసరుకులు కొనుగోలు చేసింది. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వ్యాట్ నిబంధన పరిధిలో కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు ఉండటంతో టీటీడీపై అంత భారం ఉండేది కాదు. జూలై ఒకటో తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వస్తుసేవల పన్ను (జీఎస్టీ )అమల్లోకి రానుంది. దీంతో దేవస్థానం కొనుగోలు చేసే సరుకులపై పన్నుభారం పడనుంది. ఆయా ముడిసరుకును బట్టి కనీసం 12 నుండి 18 శాతం వరకు అదనపు జీఎస్టీ పన్ను భారాన్ని మోయాల్సి వస్తోంది. పన్నుభారం కనీసం పదిశాతం లోపే అనుకున్నా అదనంగా మరో రూ.50 కోట్లు వరకూ భరించాల్సి ఉంది.
జీఎస్టీతో మరో కష్టం
భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే లడ్డూ తయారీకి టీటీడీకి రూ.35 పైబడి ఖర్చవుతోంది. అయితే, భక్తులకు రూ.25 చొప్పునే విక్రయిస్తోంది. అందులోనూ కాలిబాటలో నడిచివచ్చే భక్తులకు ఒకరికి ఒక లడ్డూ ఉచితంగా అందిస్తోంది. ఇక వీరితోపాటు సర్వదర్శనం భక్తులకూ సబ్సిడీ ధరతో రూ.10 చొప్పున రెండేసి లడ్డూలు అందజేస్తోంది. ఏటేటా ఉచిత, సబ్సిడీ లడ్డూల కారణంగా టీటీడీ రూ.50 కోట్లు వరకు అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఇక నిత్యాన్నప్రసాదం ట్రస్టు నిర్వహణకు రూ.700 కోట్లు విరాళాలు ఉన్నాయి. ఈ ట్రస్టు నిర్వహణకు వచ్చే వడ్డీ చాలటం లేదు. దీంతో టీటీడీ జనరల్ ఫండ్ నుండి రూ.50 కోట్లు దాకా సర్దుబాటు చేస్తోంది. సబ్సిడీ భారం, నిత్యాన్నదాన పథకం, పెరిగిన వివిధ శాఖల నిర్వహణ ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. 2016–2017 ఆర్థిక సంవత్సరంలో కార్పస్ ఫండ్ నుండి నిధులు మళ్లించాల్సి వచ్చింది. ఆ లోటు ఇంకా పూడ్చుకోకముందే జీఎస్టీ భారం మరింత ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో లోటును పూడ్చుకునేందుకు భక్తులపై భారం వేయాలా? సబ్సిడీ ఎత్తేయాలా? అన్న ఆలోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారు.