
గరుడ వాహనంపై దేవదేవుడు
భక్తులతో పోటెత్తిన తిరుమల
సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధవారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు. గర్భాలయంలోని మూలవిరాట్టుకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామమాల ధరించిన మలయప్ప స్వామి, గరుత్మంతుడిపై ఊరేగారు. శ్రీవిల్లి పుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన తులసి మాల, చెన్నై నుంచి వచ్చిన నూతన ఛత్రాల(గొడుగులు)ను గరుడ వాహనంలో అలంకరించారు. గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం హోరెత్తింది. స్వామి వైభోగాన్ని కళ్లారా చూసి లక్షలాది మంది భక్తులు ఆనందపరవశులయ్యారు. రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. సేవ ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కాగా, వాహన సేవ ప్రారంభం, ఊరేగింపులో వీఐపీల మధ్య చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. బంధుగణంతో తరలివచ్చిన వీఐపీలను అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది నానాతంటాలు పడ్డారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి కొత్త గొడుగులు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా జీయర్ మఠానికి చేరుకున్న 8 కొత్త గొడుగులకు ప్రత్యేక పూజలు చేసి, నాలుగు మాడవీధులలో ఊరేగించిన తర్వాత వాటిని ఆలయానికి అప్పగించారు. ఇక సమైక్యాంధ్ర బంద్ ప్రభావం, బస్సుల కొరత ఉన్నా గరుడ వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి రెండు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు.
నేడు కొత్త స్వర్ణరథం ఊరేగింపు
తిరుమలలో గురువారం శ్రీవారి కొత్త స్వర్ణరథాన్ని ఊరేగించనున్నారు. రూ.25 కోట్లతో ఇటీవల టీటీడీ దీన్ని తయారు చేయించింది. ఆగమోక్తంగా పూజలు నిర్వహించి, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రథాన్ని ఊరేగించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.