తిరుమల బ్రహ్మోత్సవాలు:స్వర్ణరథంపై గోవిందుడు | Tirumala Brahmotsavam Swarna Ratham 6th day | Sakshi
Sakshi News home page

తిరుమల బ్రహ్మోత్సవాలు:స్వర్ణరథంపై గోవిందుడు

Published Sat, Sep 23 2023 4:47 PM | Last Updated on Sat, Sep 23 2023 5:34 PM

Tirumala Brahmotsavam Swarna Ratham 6th day - Sakshi

తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వర్ణరథంపై దర్శనమిస్తున్నారు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగుతున్నారు  స్వర్ణరథనాకి కల్యాణకట్ట  నుంచి తెప్పించిన బంగారు గొలుసుతో స్వామివారిని అలంకరించారు.  ఈరోజు ఉదయం హనుమంత వాహనంలో దర్శనమిచ్చారు శ్రీవారు. ఈ రాత్రికి గజవాహనంలో దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు.

శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహ­నం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్య­క్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు.

విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్ర­మాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రా­లను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు.

టీటీడీ ఏర్పాట్లు భేష్‌.. 
బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన గరుడ వా­హన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులెవ­రూ ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 లక్షల మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలను నిర్మించింది. గరుడ సేవ దర్శనం కో­సం ఇన్నర్, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండోసారి రీఫిల్లింగ్‌ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు.

గరు­డ వాహన సేవ నేపథ్యంలో వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులతో ఘాట్‌ రోడ్డు అత్యంత రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని గ్యాలరీలూ నిండిపోయాయి. వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పాలు, బాదం పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీరు, గుగ్గిళ్లను టీటీడీ అంది­స్తూ వచ్చింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. గరుడ సేవ­ను తిలకించడానికి 3 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అంచనా. మరోవైపు భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు నుం­చి పెద్ద ఎత్తున తిరుమలకు పయనమయ్యా­రు.

శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు 2.1 కిలోమీటర్ల దూరమే ఉండటంతో భక్తులు ఈ మార్గం మీదుగా తిరుమలకు చేరుకునేందుకు ఆసక్తి చూపారు. రద్దీ నేపథ్యంలో చిన్న పిల్లలు తప్పిపోకుండా పోలీసులు జియో ట్యాగింగ్‌ వేశారు. అలాగే, గరుడసేవ నేపథ్యంలో తిరుమల బాలాజీ బస్టాండ్‌ నుంచి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహన రాకపోకలను టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులు నిషేధించారు.

ఉదయం నుంచి బాలాజీ బస్టాండ్, లేపాక్షి సర్కిల్, రాం భగీచా, నందకం గెస్ట్‌హౌస్, వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహనాల అనుమతిని నిషేధించారు. దీంతో భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా కొండ మీదకు సాఫీగా చేరుకుని గరుడ సేవను వీక్షించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement