సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. భక్తజనసందోహం నడుమ ఉదయం 6గం.55ని. రథోత్సవం మొదలుకాగా.. స్వామివారిని రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట తిప్పారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం.
రాత్రి అశ్వవాహనం
ఇవాళ రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.
రేపు చివరి రోజు
రేపు(సెప్టెంబర్ 26, మంగళవారం) చక్ర స్నాన మహోత్సవంలో ముగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాలలో ఆదివారం ఏడవ రోజు శ్రీవారిని 66,598 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.88 కోట్లుగా లెక్క తేలింది. 25,103 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment