తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో సోమవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు. అర్చకులు సాయంత్రం మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నిర్ణీత కొలతతో కూడిన కొత్త వస్త్రం మీద స్వామి వాహనమైన గరుడ బొమ్మను చిత్రీకరించారు.
ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా రామకృష్ణ దీక్షితులు క్రతువును నిర్వహించి పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడ ధ్వజం, సుదర్శన చక్రత్తాళ్వార్‌తో కలిసి ఆలయ పురవీధుల్లో ఊరేగారు.
పెద్ద శేష వాహనంపై పురుషోత్తముని అభయం
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు 7 తలల స్వర్ణశేషవాహనంపై (పెద్ద శేషవాహనం) వైకుంఠనాథుని అలంకారంలో మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. మంగళవారం ఉదయం స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ద్వారక కృష్ణుడి అలంకారంలో, రాత్రి హంస వాహనంపై సరస్వతిదేవి రూపంలో భక్తులను కటాక్షించారు. అంతకుముందు కొలువు మండపంలో స్వామివారు ఊయలూగుతూ దర్శనమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment