ఒకే గొడుగు కిందకు టీటీడీ సేవలు | sakshi funday with TTD Eo Dondapati Sambasiva Rao | Sakshi
Sakshi News home page

ఒకే గొడుగు కిందకు టీటీడీ సేవలు

Published Sun, Sep 20 2015 12:44 AM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

ఒకే గొడుగు కిందకు టీటీడీ సేవలు - Sakshi

ఒకే గొడుగు కిందకు టీటీడీ సేవలు

కోర్కెలు తీర్చే కొండలరాయునికి భక్తిశ్రద్ధలతో సామాన్య భక్తులు సమర్పించే ముడుపులతోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ముందుకు సాగుతోంది. అలాంటి ధార్మిక సంస్థలో పారదర్శక పాలనతోపాటు అన్ని విభాగాల సేవల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సామాన్య భక్తులకు మరింత చేరువ కావాలని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు సంకల్పించారు. కొత్తవాటికి, వివాదాంశాల జోలికెళ్లకుండా ఉన్నవాటిని మరింత లోతుగా అధ్యయనం చేసి లోపాలను సవరించి కొత్త జవసత్వాలతో ముందుకు నడిపించాలని భావిస్తున్న టీటీడీ ఈవో ‘సాక్షి ఫన్‌డే’తో పంచుకున్న మనోభావాలివి...
 

టీటీడీ ఈవోగా బ్రహ్మోత్సవాల బాధ్యత తీసుకోవడంపై ఎలాంటి అనుభూతి ఉంది?  
దేవదేవుని సన్నిధిలో వీఐపీ, సామాన్యుడు అన్న తేడా ఉండదు. దేవుని ముందు అందరూ సమానమే. ధార్మిక సంస్థ టీటీడీ కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సామాన్యుడే మాన్యుడు అన్న లక్ష్యంతో సాగిపోతున్నాం. బ్రహ్మోత్సవాల్లో  సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదేవుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించే బాధ్యత రావటం అదృష్టంగా భావిస్తున్నా. ఆ అనుభూతి చెప్పలేనిది. అంతకంటే బాధ్యతతో పనిచేయాలని సంకల్పించాము.

ధార్మిక సంస్థలోని వివిధ విభాగాల సేవల్ని భక్తులకు ఎలా చేరవేయబో తున్నారు?
టీటీడీలో అనేక విభాగాలున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా భక్తులకు సేవ చేస్తుంటాయి, మరికొన్ని పరోక్షంగా సేవలందిస్తాయి. వీటిలో కొన్ని భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే, మరికొన్ని ధర్మప్రచారం ద్వారా స్వామి వైభవ ప్రాశస్త్యాన్ని చాటటం, మానవ సంబంధాలు- నైతిక విలువలు పెంపొందించటం ద్వారా యువతను ధార్మికత దిశగా తీసుకెళుతుంటాయి.

రిసెప్షన్, ఆలయం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, ధర్మప్రచారంలో భాగంగా శ్రీనివాసకల్యాణోత్సవాలు, శుభప్రదం, మనగుడి, వైభవోత్సవాలు, సప్తగిరి మాసపత్రిక, శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్  వంటి ఎన్నెన్నో విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఇలా అన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భక్తుడి కేంద్రంగా సేవలందించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. అన్ని విభాగాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే భక్తుడికి టీటీడీ సేవలు సత్వరంగా లభిస్తాయి.  

ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలుతో ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం చక్కగా అమలు చేస్తున్నాం. భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. గతంలో భక్తుల మధ్య ఉండే తోపులాటలు తగ్గాయి. గతంలో కంటే స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 5నుండి 10 శాతం వరకు పెరిగింది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాం. హుండీ కానుకలు కూడా 10 శాతం వరకు పెరగటం శుభపరిణామం.
 
రూ.300 టికెట్లు, రూ.50 సుదర్శనం వంటి ఆన్‌లైన్ దర్శనాలు ఎలా అమలవుతున్నాయి?
రూ.300 టికెట్ల ఆన్‌లైన్ దర్శనాలు సజావుగా అమలవుతున్నాయి. రోజుకు 26వేలు రూ.300 టికెట్లు, మరో 4వేల వరకు రూ.50 సుదర్శనం టికెట్లు కేటాయిస్తున్నాం. భక్తుల నుంచి స్పందన విశేషంగా ఉంది. ఆ టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు  వచ్చినట్టుగాను, తిరిగి  వెళ్లినట్టుగాను తెలియటం లేదంటే ఎంత సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్నాయో ఇక చెప్పనక్కరలేదు.  దీనివల్ల సిఫారసు దర్శనాల సంఖ్య  కూడా క్రమంగా తగ్గుతోంది.

లడ్డూ నాణ్యత, రుచి విషయంలో స్వామి భక్తులు కొంత ఆవేదనతో ఉన్నారు? దిట్టాన్ని సవరించి భక్తుల కోర్కె తీరుస్తారా?
స్వామి దర్శనం తర్వాత అంత ప్రాధాన్యత లడ్డూకు ఉంది. నాణ్యత, రుచికరమైన లడ్డూలు శుచిగా తయారికీ కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి, చక్కెర, ఇతర పప్పు దినుసులన్నీ కూడా నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు కలిగిన వాటినే వినియోగిస్తున్నాం. రోజూ 3 లక్షలకు తగ్గకుండా లడ్డూలు తయారు చేస్తున్నాం. భక్తులు వేచి ఉండే కంపార్ట్‌మెంట్లలోనే లడ్డూ టోకెన్లు పొందే సౌకర్యం కల్పించాం.

భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు మీరు ఏమి చేయదలిచారు?
ఆలయ నిర్వహణాంశాల్లో వివాదాల జోలికి వెళ్లము. ఉన్న వాటిని ఎలా అభివృద్ధి చేయాలో ఆ దిశగా యోచన చేస్తాం. దేనికైనా సమయం వచ్చినప్పుడు అది తప్పక జరుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుంది. భవిష్యత్‌లో మార్పులు మాత్రం తప్పవు.

పరిపాలన సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా?
పాలనలో సంస్కరణల కంటే ఉన్నవాటిని మెరుగుపరచటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆయా విభాగాల్లో అమలు చేసేవాటిలోనే నిర్దిష్ట విధానాలను ప్రవేశ పెట్టాము. బస, కల్యాణకట్ట, అన్నప్రసాదం వంటి విభాగాలను సులభతరం చేయటం వల్ల భక్తులకు మరింత చేరువయ్యాయి. రిసెప్షన్ విభాగాల్లో గదుల వేకెన్సీ రిజర్వు తగ్గించాం. గదుల కేటాయింపుల్లో పారదర్శక విధానాల వల్ల ఆక్యుపెన్సీ  110 శాతానికి పెరిగింది. గదుల అద్దె ఆదాయం కూడా మరో 13 శాతం వరకు పెరిగింది. కల్యాణ కట్టల్లోనూ 15 నుండి 20 శాతం భక్తులు అధికంగా తలనీలాలు సమర్పించే అవకాశాలు పెరిగాయి.

వేయికాళ్ల మండపాన్ని ఎలా నిర్మించబోతున్నారు?  
చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నిర్మించాలని సంకల్పించాం. దేవదేవుని ఉత్సవాలకు అనువుగా చారిత్రక, ఆధ్యాత్మిక, ధార్మికత ఉట్టిపడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయానికి నైరుతి దిశలో నారాయణగిరి ఉద్యాననవంలో నిర్మిస్తాం. భక్తులు మండపాన్ని దర్శించేలా పూర్వవైభవాన్ని పునరుజ్జీవింప చేస్తాం.

టీటీడీ ఈవోగా మీ ప్రాధాన్యతాంశాలేమిటి?
స్వామిదర్శనం కోసం తిరుమల కొండమీద కొచ్చిన సామాన్య భక్తుడి నుంచి వీఐపీ వరకు ఉపయోగించుకునే విధంగా యాత్రిసదన్లు అభివృద్ధి చేయటమే నా తొలి ప్రాధాన్యత. ఒకేచోట అనువైన మరుగుదొడ్లు, స్నానపు గదులు, లాకర్లు, తలనీలాలు సమర్పించే సౌకర్యాలు కల్పించాలి. నాల్గు యాత్రిసదన్‌లను అభివృద్ధి చేస్తే గదులు కోరుకునే భక్తులు తగ్గుతారు. రూ.300 టికెట్లు పొందిన భక్తులు యాత్రిసదన్‌లు ఉపయోగించుకునే విధంగా వందశాతం పరిశుభ్రతతో అభివృద్ధి చేస్తాం.

తిరుమలలో నీటి ఇబ్బందులు న్నాయి. వాటిని తగ్గించేందుకు చర్యలు చేపడతాం. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతినీటి బొట్టును వినియోగించుకునేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వర్షపు నీటిని తిరిగి వాడుకునే విధంగా హార్వెస్టింగ్ చేయాలని భావిస్తున్నాం. గోగర్భం డ్యాము కింద అదనంగా చెక్ డ్యాము నిర్మిస్తాం. వాటర్‌ను ట్రీట్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తాం. అది పూర్తయితే సుమారు నాలుగు నెలలపాటు అదనంగా నీరు లభించే అవకాశం ఉంది.  

ఇక పవర్ విషయానికి వస్తే ఎల్‌ఈడీ బల్బుల వినియోగానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల అలంకరణలతోపాటు సాధారణ రోజుల్లోనూ ఎల్‌ఈడీ లైట్లనే వినియోగిస్తాం. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు పర్యావరణానికి  మేలు జరుగుతుంది. సోలార్ విద్యుత్  వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

రెండు బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి?
అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఒకటి వార్షిక, మరొకటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. రెండింటినీ అంగరంగవైభవంగా నిర్వహిస్తాం. ఏలోటూ రానివ్వం.
* బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారికి ప్రయాణం, బస, కల్పిస్తాం. ఆలయంలో మూలవిరాట్టు దర్శనంతోపాటు ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తాం. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి.
* ప్రత్యేకించి గరుడ వాహనం, చక్రస్నానంపై ఎక్కువ దృష్టిపెట్టాం. గరుడ వాహనంపై మలయప్పస్వామిని దర్శించేందుకు వచ్చే అశేష జనవాహిని సంతృప్తిగా స్వామిని దర్శించే ఏర్పాట్లు చేశాం. వాహనాన్ని బాగా రద్దీ ఉండే ప్రాంతాల్లో తిప్పుతూ భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తాం.
* టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఆర్టీసీ విభాగాల మధ్య సమన్వయం పెంచాం. అందరికీ బాధ్యతలు అప్పగించాం. అమలయ్యేలా ప్రత్యేక ఆదేశాలిచ్చాం.  అందరూ ఒకే మాటమీద ఉంటూ అన్నీ విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాం.
* ఆలయ నాలుగు మాడ వీధుల్లో అన్నప్రసాదం, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.  వాహన సేవను శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలు  చేస్తాము. అధునాతన కెమెరాలు వినియోగిస్తాం. వాహన సేవ విశిష్టతను తెలిపేందుకు అనుభవజ్ఞులైన వ్యాఖ్యాతలను ఏర్పాటు చేస్తాం.
* ఉత్సవాల్లో ఉత్సవమూర్తుల అలంకరణకు, వాహన సేవల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం.  శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అలంకారాల్లో ఏలోటూ రానివ్వకుండా చూసుకోవలసిందిగా సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చాం.
* భక్తులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అందుకోసం అనుభవ జ్ఞులైన కళాకారుల్ని ఎంపిక చేశాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement