
తిరుమలకు తప్పిన నీటిగండం
బ్రహ్మోత్సవాలకు సమస్య లేనట్టే
సాక్షి, తిరుమల: వచ్చే నెలాఖరులో నిర్వహించనున్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు నీటి సమస్య తొలగింది. వారం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాల్లోకి నీరు చేరుతోంది. తెలుగు గంగనుంచి వచ్చే సరఫరా, బోర్లలో లభించే నీరు దీనికి అదనం. ప్రస్తుతం లభ్యమయ్యే నీరు వంద రోజులకు సరిపోతుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొన్నటి వరకూ నీటి లభ్యతపై ఆందోళనగా ఉన్న టీటీడీకి ప్రస్తుత వర్షాలు ఊరటనిచ్చాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నీటి గండం ఎలా అధిగమించాలో తెలియక టీటీడీ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరుణుడు కరుణించడంతో వారం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాల్లోకి వర్షపు నీరు చేరింది. గోగర్భం డ్యాంలో 151 లక్షల గ్యాలన్లు, పాపవినాశనంలో 790 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 580 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 232 లక్షల గ్యాలన్ల నీరు చేరింది.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తులు కిటకిటలాడారు. సాయంత్రం 6 గంటల వరకు 29,382 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు. వెలుపల కిలోమీటరు వరకు వేచిఉన్నారు. వీరికి 24 గంటల తర్వాత దర్శనం లభించనుంది. కాలిబాట భక్తులకు 16 గంటలు, రూ. 300 టికెట్ల దర్శన భక్తులకు 8 గంటల తర్వాత దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో గదుల కోసం భక్తులు పడిగాపులు కాచారు. నాలుగు గంటల పాటు వేచిఉన్నా తలనీలాలు తీయడం ఆలస్యం కావడంతో జీఎన్‌సీ వద్దున్న కల్యాణకట్టలో భక్తులు ఆగ్రహంతో గేటు విరిచారు. హుండీలో గురువారం భక్తులు సమర్పించిన కానుకల్ని శుక్రవారం లెక్కించగా రూ. 3.23 కోట్లు లభించింది.