తెలంగాణ తిరుపతి ‘మన్యంకొండ’ | Telangana Tirupati Manyamkonda In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

తెలంగాణ తిరుపతి ‘మన్యంకొండ’

Published Tue, Sep 3 2019 8:07 AM | Last Updated on Tue, Sep 3 2019 8:07 AM

Telangana Tirupati Manyamkonda In Mahabubnagar District - Sakshi

 మన్యంకొండ దేవస్థాన గోపురం , మన్యంకొండ దేవస్థానం 

సాక్షి, దేవరకద్ర: మహబూబ్‌నగర్‌ జిల్లా మన్యంకొండలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతోంది. ఉలి ముట్టని స్వామి, చెక్కని పాదాలు, తవ్వని కోనేరు స్వామివారి దేవస్థానం ప్రత్యేకత. ఆర్థికస్తోమత లేని భక్తులు తిరుపతి వెళ్లకుండా మన్యంకొండ స్వామిని దర్శించుకుంటే అంతే పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం.  అంతటి విశిష్టత కలిగిన మన్యంకొండ పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఏటా స్వామివారి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఉమ్మడి జిల్లాలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. వివిధ డిపోల నుంచి మన్యంకొండ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉత్సవాలు తిరుపతి నుంచీ మన్యంకొండ స్టేజీ నుంచి దేవస్థానం వరకు ప్రత్యేక మినీ బస్సులను తెప్పించి నడుపుతారు.

3 కి.మీ. ఘాట్‌రోడ్డు
మన్యంకొండ స్టేజీ నుంచి గుట్టపై వరకు సుమారు 3 కి.మీ. ఘాట్‌రోడ్డు ఉంది. ఎత్తయిన గుట్టపై స్వామి కొలువుదీరారు. చుట్టూ గుట్టలు, పచ్చని వాతావరణం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవస్థానానికి వచ్చే భక్తులు గుట్టపై నుంచి ఇరువైపులా నుంచి కిందికి చూస్తే చల్లని గాలి హాయిలో పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. దేవస్థానం ముందు కోనేరు ఉంది. అలాగే ఈ కోనేరుకు సమీపంలో ఉలి ముట్టని స్వామివారి పాదాలున్నాయి.

ఈ పాదాలకు సమీపంలోని గుట్టపై గతంలో మునులు తపస్సు చేసిన గుహలున్నాయి. గతంలో ఇక్కడ మునులు తపస్సు చేసినందుకే ఈ ప్రాంతాన్ని మన్యంకొండగా వినతికెక్కినట్లు పురాణగాథ. అలాగే దిగువకొండ వద్ద అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. స్టేజీకి కేవలం అర కిలోమీటర్‌ దూరంలో ఈ పుణ్యక్షేత్రం కొలువుదీరింది. దేవస్థానంలో ఏటా వందలాది వివాహాలు జరుగుతాయి. 

ఇలా వెళ్లాలి..
హైదరాబాద్‌ నుంచి కర్ణాటక, రాయచూర్, నారాయణపేట, ఆత్మకూర్, మక్తల్, యాద్గిర్‌కు బస్సులు మహబూబ్‌నగర్‌ మీదుగా మన్యకొండకు వెళ్తుంటాయి. మహబూబ్‌నగర్‌ నుంచి 19 కి.మీ. దూరంలో ఈ దేవస్థానం ఉంటుంది. అలాగే రాయచూర్‌ నుంచి రావాలంటే హైదరాబాద్‌కు వెళ్లే బస్సు ఎక్కి మన్యంకొండలో దిగవచ్చు. స్టేజీ నుంచి గుట్టపైకి ప్రత్యేక ఆటోల సౌకర్యం ఉంది. విశేష దినోత్సవాల్లో మినీ బస్సులు గుట్టపైకి వెళ్తుంటాయి. అలాగే రైలు మార్గం ద్వారా వెళ్లే ప్రయాణికులు ఇటు కర్నూల్, అటు హైదరాబాద్‌ నుంచి రావాలంటే మార్గమధ్యలోని కోటకదిర రైల్వే స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి మన్యంకొండ స్టేజీ వరకు ఆటోలు వెళ్తుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement