అలంకరణలో వేంకటేశ్వరస్వామివారు
మన్యంకొండలో వైభవంగా శేషవాహన సేవ
Published Fri, Aug 19 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
దేవరకద్ర రూరల్ : మన్యంకొంలోని లక్ష్మీవేంటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం అర్ధరాత్రి స్వామివారి శేష వాహనసేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతుల విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు ఆభరణాలు, రకరకాల పూలతో స్వామి దంపతులను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు.
స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చన నిర్వహించారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని పుష్కరాలకు వెళ్లే చాలా మంది భక్తులు అంతకుముందు జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని రాత్రి ఇక్కడే బస చేశారు. దీంతో మన్యంకొండలో భక్తుల రద్దీ కనిపించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి నారాయణస్వామి, సభ్యుడు మధుసూదన్‌కుమార్, ఈఓ కె.శ్రీనివాసమూర్తి, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement