ఉసురు తీసిన పేదరికం
► కాలేయ వ్యాధితో చిన్నారి శరణ్య మృతి
ధర్మపురి : పేద కుటుంబంలో జన్మించడమే ఆ చిన్నారి చేసిన పాపం. అనారోగ్యానికి కటిక పేదరికం తోడై నరకయాతన అనుభవించిన చిన్నారిని మృత్యువు కబళించింది.దర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన కరాజుల రవి, లక్ష్మి దంపతులకు కూతురు శరణ్య (7)తో పాటు ఒక కుమారుడున్నారు. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి వారిది. ఉపాధి కోసం రవి దుబాయికి వలస వెళ్లాడు. లక్ష్మి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నాలుగు నెలల క్రితం కడుపు నొప్పితో బాధ పడుతున్న శరణ్యను తల్లి చేతిలో ఉన్న డబ్బుతో కరీంనగర్ ఆస్పత్రికి తీసికెల్లి తల్లి వైద్యం చేయించింది. శరణ్య పొట్ట రోజురోజుకూ పెరిగిపోతూ శ్వాస కూడా కష్టంగా మారింది. వారానికోసారి కరీంనగర్ వెళ్లి కడుపులోంచి నీడిల్‌తో నీటిని బయటకు తీసేవారు. రెండు నెలల క్రితం కరీంనగర్‌లో మరో ఆస్పత్రిలో చూపించగా పాప కాలేయం చెడిపోయిందని వైద్యులు తెలిపారు.
తమిళనాడు ఆస్పత్రికి తరలింపు:
పాప కాలేయం చెడిపోయిందని, తమిళనాడులోని వేలూరు ఆస్పత్రికి తీసికెల్లాలని, రూ. 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లి దిక్కుతోచని స్థితిలో పడింది. ఆమె దీన స్థితిని ధర్మపురికి చెందిన రేణికుంట రమేశ్ ఫేస్‌బుక్ ద్వారా తెలపడంతో బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ముందుకొచ్చి వైద్య ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఆస్పత్రిలో రూ. 80 వేలు ముందస్తుగా చెల్లించారు.
ఇరవై రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో చెన్నై తరలించాలని, కాలేయం మార్పిడికి రూ. 20 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు మరో పిడుగులాంటి వార్త చెప్పారు. చేసేదేం లేక ప్రాణాపాయ స్థితిలోని శరణ్యను తీసుకుని తల్లి ఇంటికి చేరుకుంది. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌కు సమాచారం అందించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలందే ఏర్పాట్లు చేశారు. 15 రోజులు వైద్యం అందాక పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకొచ్చింది. నరకయాతన అనుభవించిన చిన్నారి శరణ్య నొప్పితో బాధపడుతూ శుక్రవారం మరణించింది. తమ పేదరికమే కూతుర్ని బలితీసుకుందంటూ తల్లి రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.