
అందుకే నాపై కక్ష గట్టాడు: శిల్పా
సాక్షి, నంద్యాల: తమపై హత్యాయత్నం చేసిన టీడీపీ నేత అభిరుచి మధుకి నేర చరిత్ర ఉందని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. నేర చరిత్ర కారణంగా అప్పటి పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న మధును సస్పెండ్ చేశామని ఆ అక్కసుతో తనపై హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ రోజున కావాలనే తమతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా సహనం పాటించామన్నారు.
గురువారం ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడుతూ.. రౌడిషీట్ ఉన్న మధుకు గన్‌మెన్ ఇవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. మధు ఆగడాలు, దుర్మార్గాల గురించి చంద్రబాబు, లోకేశ్‌లకు తెలుసునని వెల్లడించారు. మారణాయుధాలతో మధు సృష్టించిన వీరంగంపై పోలీసులకు వెంటనే తెలియజేశానని చెప్పారు. పోలీసులు ఆలస్యంగా రావడం బాధాకరమన్నారు. మాపైన దాడులు చేసి మాపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. దీన్ని చట్టప్రకారం ఎదుర్కొంటామని ప్రకటించారు. గొడవలు పెట్టుకోవాలనే తత్వం శిల్పా కుటుంబానికి లేదని, అలాగని తాము భయపడే రకం కాదని అన్నారు. అధికారముందని బెదిరిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. నంద్యాల శాంతియుతంగా ఉండాలన్నదే తమ కోరిక అని చక్రపాణిరెడ్డి తెలిపారు.