మాట్లాడుతున్న పోటు రంగారావు
ఖమ్మం సిటీ: ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు అన్నారు. నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ నేతల ప్రోత్సాహంతో పోలీసులు, అటవీ అధికారులు కలిసి తమ పార్టీ కార్యకర్తలకు.. గిరిజనుల చెందిన నిలువెత్తున పెరిగిన పంట చేలను ట్రాక్టర్లతో దున్నించారని విమర్శించారు. టేకులపల్లి మండలం వాగొట్టుగూడెంలో మహిళలపై దాడి చేసి, సృహ కోల్పోయేలా కొట్టి 100 ఎకరాలలో పంట దున్నారని అన్నారు. ఇల్లందు ఏరియాలో ఎమ్మెల్యే, డీఎస్పీ కలిసి పేదలపై, గిరిజనులపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇల్లందు ఏరియాలో పోలీసు రాజ్యాన్ని డీఎస్పీ సాగిస్తున్నారని అరోపించారు. గిరిజనులు, పేదలపై దాడులను నిరసిస్తూ ఈ నెల 8,9 తేదీలలో రాష్ట్రవ్యాపితంగా నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. సమావేశంలో నాయకులు రాయల చంద్రశేఖర్‌రావు, వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.