
ఎస్‌ఈ అక్రమాస్తులు..రూ. 50 కోట్లు
♦ రెండోరోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు
♦ బ్యాంకు లాకర్లు, ఖాతాలూ తనిఖీ చేస్తామని వెల్లడి
♦ ఎస్‌ఈ రాఘవేంద్రరావును ఏసీబీ స్టేషన్‌కు తరలింపు
లక్ష్మీపురం (గుంటూరు) : జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేవీ రాఘవేంద్రరావు అక్రమాస్తులు రూ.50 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం పది ప్రదేశాల్లోని ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. గురు, శుక్రవారాల్లో గుర్తించిన ఆస్తుల మొత్తం ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.50 కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది.
గతంలో 2009లో ఎస్‌ఈ రాఘవేంద్రరావు విజయవాడలో ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆస్తుల వివరాలను, రికార్డులను తెలియపరచాల్సిందిగా కోరుతూ కేసు నమోదు చేశారు. గతంలో ఆ కేసును కొట్టివేశారు. తిరిగి 2015 నుంచి గుంటూరు జిల్లాలో ఎస్‌ఈగా విధులు నిర్వర్తిస్తున్న రాఘవేంద్రరావు బినామీ కాంట్రాక్టర్లతో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత దాడులు నిర్వహించారు. అయితే జిల్లాలో ఏసీబీ అధికారులు ఒకే అధికారిపై రెండు పర్యాయాలు దాడులు నిర్వహించడం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. శుక్రవారం నాటి సోదాల వివరాలను ఏసీబీ డీఎస్పీ దయానంద్ శాంతో వెల్లడించారు.
అధికారులకు సహకరించని ఎస్‌ఈ
ఏసీబీ దాడులు నిర్వహించినప్పటికీ ఎస్‌ఈ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ వారికి సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. బినామీ కాంట్రాక్టర్లు, బిల్డర్లతో పాటు రాఘవేంద్రరావు తండ్రి సుబ్బారావు పేరుతో, తమ్ముడు వరుస అయ్యే రఘు, మరికొందరు బినామీలుగా వ్యవహారం నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. గుంటూరులో ఓ కాంట్రాక్టర్ భాస్కరరావు అనే వ్యక్తికి బినామీ పేర్లతో కాంట్రాక్టులు అప్పజెప్పి సొమ్ము చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
అధికారులు గుర్తించిన అక్రమ ఆస్తుల వివరాలు..
మంగళగిరిలో 968 గజాల స్థలాన్ని 2014లో రూ.28.29 లక్షలకు కొనుగోలు చేశారు. 2010లో రూ.9 లక్షలతో హోండా కారు, ఎస్‌ఈ కుమారుడు వంశీ కృష్ణ పేరుతో మచిలీపట్నంలో 2014లో 572.33 గజాల ప్లాట్‌ను రూ.9 లక్షలు, మంగళగిరిలో 968 గజాల ప్లాట్‌ను 2014లో రూ.26.31 లక్షలు, గుంటూరు గోరంట్లలో 2015లో 200 గజాల ప్లాట్‌ను రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. అదే విధంగా వ్యవసాయ భూములు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌లో 1.5 ఎకరాల భూమిని 2010లో రూ.1.35 లక్షలకు, తుళ్లూరు గ్రామంలో 52 సెంట్ల భూమిని 2014లో రూ.2.08 లక్షలకు, నెల్లూరు జిల్లాలో 1.95 సెంట్ల భూమిని 2013లో రూ.5.85 లక్షలకు కొనుగోలు చేశారు.
ఆయన తండ్రి సుబ్బారావు పేరుతో మంగళగిరిలో 1413.16 గజాల స్థలాన్ని 2013లో రూ.42.39 లక్షలకు, గుంటూరు రూరల్ అంకిరెడ్డిపాలెంలో 338 గజాల భూమిని 2013లో రూ.5.07 లక్షలకు, మచిలీపట్నంలో 598.66 గజాల భూమిని 2014లో రూ.9.5 లక్షలకు, గుంటూరు శ్యామలానగర్‌లో 744 గజాల భూమిని 2014లో రూ.66.95 లక్షలకు ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌లో 2011లో ఒక ఎకరా భూమిని రూ.1.75 లక్షలకు, అదే ప్రాంతంలో 4.28 సెంట్ల భూమిని రూ.7.49 లక్షలకు కొనుగోలు చేశారు.
శ్రీనివాస చౌదరి పేరుతో రూ.12 లక్షలతో కారు, కృష్ణాకుమార్ అనే బినామీ పేరుతో రూ.18 లక్షల విలువ చేసే కారును కొనుగోలు చేశారు. వీటితో పాటుగా రూ.30 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ బాండ్‌లు, వజ్రాభరణాలు రూ.32 లక్షలు, బంగారం రూ.8 లక్షలు, వెండి 3 కేజీలు రూ.1.50 లక్షలు, నగదు రూ.5.77 లక్షలు, రూ.10 లక్షల విలువ చేసే సామగ్రి ఉన్నట్లు కేసు దర్యాప్తులో గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. ఎస్‌ఈ రాఘవేంద్రరావును శుక్రవారం అరెస్ట్ చేసి ఏసీబీ స్టేషన్‌కు తరలించారు. బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ఖాతాలను కూడా తనిఖీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.