తిరుమల ఘాట్‌లో ప్రమాదం జరిగిన స్థలం
♦ దంపతులు దుర్మరణం
♦ మృతులు తమిళనాడులోని తిరువళ్లూరువాసులు
తిరుమల: తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు దంపతులు దుర్మరణం చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన గోవిందరాజు (47), ఆయన సతీమణి లక్ష్మి(42) ద్విచక్రవాహనంలో తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మంగళవారం అదే వాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు. ఉదయం 11.25 గంటలకు మార్గంలోని 35వ మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గోవిందరాజు, లక్ష్మి కింద పడి గాయపడ్డారు.
దీంతోపాటు వారిపై బస్సు వేగంగా ఎక్కింది. దీంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా గోవిందరాజు మృతి చెందారు. మృత దేహాలను మెడికల్ కళాశాలకు తరలించారు. ఘటన స్థలిని తిరుమల ఏఎస్‌పీ త్రిమూర్తులు, ఎస్‌ఐ తులసీరామ్ సందర్శించి కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రై వేట్ వాహనాల తరహాలోనే వేగంగా వెళ్లటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.