ప్రాణాలు తీసిన ఓవర్‌టేక్
కణేకల్లు : ఓవర్ టేక్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వేగంగా బైక్ నడుపుతూ ముందు వెళుతున్న ఆటోను ఓవర్‌టేక్ చేసి కిందపడిన వారిపై ట్రాక్టర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఎస్‌ఐ యువరాజు కథనం మేరకు.... కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన కుమ్మరి సంజీవప్ప (34) నిరుపేద రైతు. రెండేళ్ల క్రితం ఇతను డి.హిరేహళ్ మండలం గొడిశెలపల్లికి కుటుంబాన్ని మార్చాడు. తహసీల్దార్ కార్యాలయంలో పని నిమిత్తం ఉదయం కణేకల్లుకు వచ్చాడు. సాయంకాలం 6గంటల సమయంలో పని పూర్తి కావడంతో స్వగ్రామానికి బయలుదేరాడు.
తనకు బాగా తెల్సిన గోపులాపురానికి చెందిన సన్నకారు రైతులు యల్లప్ప (32), హనుమంతరాయుడు (38)లు కూడా తహసీల్దార్ కార్యాలయానికొచ్చారు. కణేకల్లుక్రాస్ వరకు ద్విచక్ర వాహనంలో వస్తానని చెప్పడంతో సంజీవప్ప తన ఎక్స్‌ఎల్ సూపర్ బైక్‌లో యల్లప్ప, హనుమంతరాయుడులను ఎక్కించుకొని తహసీల్దార్ కార్యాలయం నుంంచి బయలు దేరాడు. ఆలూరు గ్రామం దాటాక చిన్న ఆటోను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో ఆటో వెనుకభాగంలో ద్విచక్ర వాహనం తగిలి కింద పడ్డారు. అదే సమయంలో కణేకల్లుక్రాస్ నుంచి ఆలూరుకు వస్తున్న ట్రాక్టర్ వారిపై దూసుకెళ్లింది.
ఈ ఘటనలో సంజీవప్ప, యల్లప్పత లలు పగిలి అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ యువరాజు, తహసీల్దార్ ఆర్.వెంకటశేషు ఘటన స్థలాన్ని పరిశీలించారు. యల్లప్పకు భార్య సుశీలమ్మతోపాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. సంజీవప్పకు భార్య ప్రమీలమ్మ ఇద్దరు కొడుకులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.