ప్రమాదం మిగిల్చిన దుఃఖం
కారు, బైక్ ఢీ
మహిళ మృతి.. భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు
నరసరావుపేట టౌన్: కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా ఆమె భర్త, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన మన్నవ అనూష (21).. భర్త నాగమల్లేశ్వరరావు, వారి రెండున్నరేళ్ల కుమార్తె మోక్షితతో కలిసి వినుకొండలో ఉన్న పుట్టింటికి వచ్చారు. పుష్కరాల సందర్భంగా పుట్టింటి వాళ్లు పెట్టే చీర తెచ్చుకునేందుకు వచ్చి తిరిగి ద్విచక్ర వాహనంపై ముగ్గురూ గుంటూరు వెళ్ళేందుకు మంగళవారం సాయంత్రం పయనమయ్యారు. మార్గమధ్యంలోని నరసరావుపేట పట్టణ శివారు ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలోకి రాగానే గుంటూరు నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూష మృతి చెందింది. మోక్షిత కాలు, చెయ్యి విరిగిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకొన్న ఇరు కుటుంబాల సభ్యులు వైద్యశాల వద్దకు చేరుకొని బోరున విలపించారు.