టైమ్ ప్రకారం బండి నడవడం లేదు | According to Time do not walk to the cart | Sakshi
Sakshi News home page

టైమ్ ప్రకారం బండి నడవడం లేదు

Published Tue, Nov 10 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

టైమ్ ప్రకారం బండి నడవడం లేదు

టైమ్ ప్రకారం బండి నడవడం లేదు

♦ ఎంఎంటీఎస్ రాకపోకల్లో జాప్యంపై ప్రయాణికుల అసంతృప్తి
♦ హైలైట్స్, రిస్తా యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదు
♦ గంటల తరబడి రైళ్లలో నిలబడే ప్రయాణిస్తున్నాం.. సీట్లు పెంచండి
♦ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
♦ సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య పర్యటించిన రవీంద్ర గుప్తా

 ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సకాలంలో ఆఫీసుకు చేరుకోలేకపోతున్నాం. సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీకి ప్రయాణ సమయం నలభై నిమిషాలు. అయితే మరో నలభై నిమిషాలు ఆలస్యమవుతోంది.
- హైటెక్‌సిటీలో పనిచేసే ఓ సాఫ్ట్‌వేర్ నిపుణుడి ఆవేదన ఇదీ..

 రైళ్ల రాకపోకలకు సంబంధించిన ప్రత్యక్ష సమాచారం తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ‘హైలైట్స్’ యాప్ ఒక్కోసారి స్పందించడం లేదు. సరైన రైళ్ల సమాచారం లభించడం లేదు.
 - మరో ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ఇదీ..

 మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘రిస్తా’ యాప్‌పై చాలామందికి అవగాహన లేక ఈ యాప్‌ను వినియోగించుకోలేకపోతున్నారు. దీనిపై అవగాహన కల్పించండి.
 - సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ వైపు ప్రయాణిస్తున్న యువతుల సూచన ఇదీ..

 ఎంఎంటీఎస్ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాకు అందిన ఫిర్యాదులివీ. రవీంద్ర గుప్తా సోమవారం సికిం ద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ట్రైన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రద్దీ వేళల్లో అర గంట నుంచి 45 నిమిషాల వరకు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, దీంతో ఎంఎంటీఎస్‌లను నమ్ముకుని ఉద్యోగాలు చేసే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రయాణికులు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణ సమయంలో గంటల తరబడి నిలబడాల్సి రావడంపై కొందరు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, రైళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వీసుల సంఖ్యను పెంచాలని సూచించారు.

 వేగంగా.. సురక్షితంగా నడుపుతాం: జీఎం
 ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు రవీంద్ర గుప్తా వివరించారు. ‘రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల 5 శాతం ఆక్యుపెన్సీ తగ్గింది. ప్రయాణికులు ఎంఎంటీఎస్‌పైన నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. రైళ్ల వేగాన్ని పెంచుతాం. ఆలస్యానికి అవకాశం లేకుండా బండ్లు నడుపుతాం. హైలైట్స్, రిస్తా యాప్స్‌లో సాంకేతిక సమస్యలు తొలగించి ప్రయాణికులు సమర్థవంతంగా వినియోగించేలా విస్తృత ప్రచారం చేస్తాం. ఎంఎంటీఎస్ రెండో దశ పనులపై సమీక్షించి నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.    
- సాక్షి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement