- దోపిడీలతోపాటు హత్యలు
- 107 కేసుల్లో నలుగురు నిందితులు, ఒక రిసీవర్ అరెస్ట్
- దొంగతనం, హత్యలు చేసిన 12 ఏళ్ల తర్వాత..
- అరెస్టయినవారిలో న్యాయవాది
- 12 ఏళ్లుగా విజయవాడలో ప్రాక్టీస్
విజయవాడ: గొలుసు దొంగతనాలు, హత్యలు చేసే నలుగురు సభ్యులతో కూడిన ముఠాను విజయవాడ కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 50 లక్షలు విలువచేసే 1400 గ్రాముల బంగారం, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో విజయవాడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, నిందితుల నుంచి బంగారం కొనుగోలు చేసే వ్యక్తి ఉన్నారు. ముఠాపై కమిషనరేట్ పరిధిలో 107 కేసులు ఉన్నాయి.
దొరికింది ఇలా..
విజయవాడ నగర శివారులోని తాడిగడప సెంటర్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ముఠాకు సంబంధించిన కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ముఠా సభ్యులైన సింగారవేలు రామచంద్రన్, దేవర ప్రవీణ్‌కుమార్‌లు బుధవారం తాడిగడప 100 అడుగుల రోడ్డులో అనుమానంగా సంచరిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన సింగారవేలు రామచంద్రన్ అలియాస్ శిరివెళ్ల రాము అలియాస్ జోసఫ్ కారు పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన పాగోలు రాము ద్వారా బంకూరి వెంకట శివనాగరాజు (న్యాయవాది) పరిచయం అయ్యాడు. ఇద్దరికి జోడీ కుదిరింది. కొంతకాలం తర్వాత వీరికి ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కాలనీకి చెందిన కుడిపూడి శ్రీనివాసరావు అలియాస్ కొండపల్లి శ్రీను, అతని స్నేహితుడు తలారి రామబహదూర్, పెండెం నరేష్‌బాబులతో స్నేహం ఏర్పడింది. సులువుగా డబ్బు సంపాదించాలని అందరూ కలిసి కొన్నేళ్ల కిందట దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. ఇద్దరిద్దరి చొప్పున టీమ్ గా ఏర్పిడి దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నారు.
దొంగతనాల కోసం ముందుగా ఒడిశా రాష్ట్రంలోని జార్ఫుగూడలో నివసించే తన స్నేహితుల ద్వారా 2001లో రూ. 50 వేలు పెట్టి ఒక తుపాకీ, ఆరు తూటాలను శివనాగరాజు కొనుగోలు చేశాడు. చోరీ తర్వాత తొందరగా తప్పించుకునేందుకు ఓ కారును దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. 2003 మే 15న కంకిపాడు-ఉయ్యూరు మార్గంలో నిందితులు రామచంద్రన్, శివనాగరాజులు ఏపీ16ఎల్1777 నంబర్ గల మారుతీ కారును వెంటాడి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి కారు యజమాని చలపతిరావు మరణించడంతో ఆ కారును దొంగిలించకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం వేరే ప్రాంతంలో చోరీల కోసం ఓ కారును దొంగిలించారు.
నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి శివనాగరాజు 50 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బు చెల్లించాలంటూ అతను శివనాగరాజుపై ఒత్తిడి తేవడంతో అతన్ని అంతమొందించేందుకు అందరూ కలిసి కుట్ర పన్నారు. రాజమండ్రిలో డబ్బులు ఇస్తామంటూ చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చారు. అది తీసుకున్న నరేంద్ర రెడ్డి అపస్మారక స్థితికి చేరడంతో ఒంటిపై బట్టలు తీసేసి గోదావరిలో పారేశారు. 2003లో నరేంద్ర రెడ్డి మిస్సింగ్ కేసు నమోదయింది. 2004లో కాజ బ్యాంకులో దొంగతనం చేయడానికి ప్రయత్నించి విఫలం చెందారు.
బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపి తప్పించుకు పారిపోయారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. నిందితుడు శివనాగరాజుకు కళశాలలో చదివే రోజుల నుంచే నేర చరిత్ర ఉంది. 2004లో న్యాయశాస్త్రం నుంచి పట్టా పొందిన నాగరాజు బెజవాడ్ బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. 2004 నుంచి ముఠాకు కొంత దూరంగా ఉంటున్నాడు. కాగా, మిగిలిన మిత్రులు దొంగతనాలకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాడిగడపలో రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని అనుమానించిన పోలీసులు విచారించడంతో వాస్తవాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి ఇప్పటివరకు 28 కేసుల్లో 1,400 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు.