పోలీసుల అదుపులో డీలర్ హత్యకేసు నిందితులు
Published Mon, Jan 30 2017 10:42 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
వివిధ కోణాల్లో కొనసాగుతున్న విచారణ
కర్నూలు : డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌గౌడు దారుణ హత్యకు కారకులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులు, ఎరుకలి రాము, శివనాయక్, చిన్నమౌలాలి అలియాస్ కిట్టు తదితరులను ఐదు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని కర్నూలు శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలోని ఒక ప్రత్యేక గదిలో ఉంచి విచారిస్తున్నారు.
137వ చౌక డిపో డీలర్ ఎరుకలి చంద్రశేఖర్‌కు ఎరుకలి శ్రీను సమీప బంధువు. 109వ నెంబర్ చౌకడిపో డీలర్ కళావతి రాజీనామా చేయడంతో చంద్రశేఖర్ పేరుతో ఇన్‌చార్జి వేయించుకుని ఎరుకలి శ్రీను కూడా బినామి డీలర్‌గా వ్యవహరిస్తున్నాడు. సొంతంగా డీలర్‌షిప్ సంపాధించుకునేందుకు వెంకటేష్ గౌడును ఆశ్రయించాడు. ఏడాది కాలంగా వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారు. అధికారులతో మాట్లాడి 109వ చౌకడిపోను ఇప్పిస్తాను.. అందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పి ఎరుకలి శ్రీను దగ్గర వెంకటేష్‌గౌడు డబ్బులు తీసుకున్నాడు. నెలలు గడచిపోతున్నా డీలర్‌షిప్ దక్కకపోవడంతో డబ్బుల విషయంలో వీరి మధ్య వివాదం చోటు చేసుకుంది. హత్య జరిగిన 24వ తేదీకి వారం రోజుల ముందు కూడా కలెక్టరేట్‌లో తీవ్రస్థాయిలో డబ్బుల కోసం వారిద్దరు గొడవ పడినట్లు పోలీసు విచారణలో వెలుగుచూసింది. హత్య జరిగిన మరుసటిరోజు నుంచి ఎరుకలి శ్రీను సెల్‌ఫోన్ స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతనిపై ప్రత్యేక దృష్టి సారించి ఐదు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.
హత్యలో డీలర్ల పాత్ర ఉందా?
నగరంలోని 121, 148, 95 చౌక డిపోలు హతుడు వెంకటేష్‌గౌడ్ బంధువుల పేరుతో ఉన్నాయి. 163వ చౌక డిపోకు కూడా వెంకటేష్‌గౌడ్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఈ–పాస్ కుంభకోణంలో జిల్లా వ్యాప్తంగా 161 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారు. ఈ–పాస్ మిషన్‌ను ట్యాంపరింగ్ చేసి నిత్యావసర సరుకులను పక్కదారి పట్టించిన డీలర్ల వివరాలను వెంకటేష్‌గౌడు విజిలెన్స్ అధికారులకు, సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న కసితో కాంట్రాక్టు హత్య చేయించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్నూలు నగరంలోని చౌక డిపో డీలర్లు హనుమంతయ్య, పక్కీరప్ప, గనిబాషా, నూర్ బాషా, లక్ష్మన్న, ప్రమీలమ్మ, వడ్డెగేరి రమేష్, ఎరుకలి శ్రీను తదితరులే ఈ దారుణానికి ఒడిగట్టారని హతుని భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులోని డీలర్లను కూడా పోలీసులు పిలిపించి తమదైన శైలిలో విచారించారు. హత్య సంఘటన వెనుక డీలర్ల పాత్ర ఉందా లేక డీలర్‌షిప్ ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేసినందుకే ఎరుకలి శ్రీను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement