అక్రమాలకు అండ | acqua ponds mafia | Sakshi
Sakshi News home page

అక్రమాలకు అండ

Published Tue, Mar 7 2017 11:43 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

అక్రమాలకు అండ - Sakshi

అక్రమాలకు అండ

చెరువులకు గండ్లుకొట్టిన అధికారులు
 మరునాడే వాటికి అనుమతులు 
 పేట్రేగుతున్న ఆక్వా మాఫియా
 మామూళ్ల మత్తులో జిల్లాస్థాయి కమిటీ
 ఆందోళనలో వరి రైతులు 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
అక్రమ చెరువులకు అధికారిక రంగులు అద్దుతున్నారు. దీంతో ఆక్వా మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్విన అక్రమ చెరువులు తవ్వకాలకు తాము అండగా ఉంటామనే విషయాన్ని అధికారులు అనుమతులు మంజూరు చేయడం ద్వారా స్పష్టంగా చాటుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు బాడవ ఆయకట్టులో 163 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమంగా చేపల చెరువులు తవ్వారు. వాటికి ఎలాంటి అనుమతులు లేకపోగా.. చెరువల తవ్వకాలు పూర్తయ్యాక అందులో 69.85 ఎకరాలకు 3 దరఖాస్తులు (పీఆర్‌ఎఫ్‌ 011700018229 / 011700018228 / 01170018226 ) ఆన్‌లైన్‌ చేఃఇరు. ఈ విషయాలను ఆధారాలతో సహా ’సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో’ శీర్షికన గత నెల 16వ తేదీన ’సాక్షి’ కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ ఎం.సుందర్రాజు సిబ్బందితో కలసి అక్రమ చెరువు గట్లకు యంత్రాలతో తూతూమంత్రంగా గండి కొట్టించారు. అనుమతులు లేకుండా చెరువులు తవ్వడం నిబంధనలకు విరుద్దమని, ఈ చెరువులకు అనుమతులు రావడం చాలా కష్టమని రెవెన్యూ అధికారులే ఆ రోజున చెప్పారు. ఇందుకు భిన్నంగా ఆ మరునాడే.. ఫిబ్రవరి 17న ఒక దరఖాస్తుకు, ఫిబ్రవరి 20న మిగిలిన రెండు దరఖాస్తులకు జిల్లాస్థాయి కమిటీ అధికారి, మత్స్య శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ ఎండీ అబ్దుల్‌యాకుబ్‌ బాషా తాత్కాలిక అనుమతులను ఆగమేఘాలపై మంజూరు చేయడం విశేషం. అక్రమ చెరువులు తవ్వుతున్న ఆక్వా మాఫియాకు క్షేత్రస్థాయి నుండి జిల్లాస్థాయి  అధికారుల వరకూ మద్దతు ఏమేరకు ఉందనే విషయం దీనిద్వారా స్పష్టమవుతోంది. 
మరో కోణం ఇదీ
ఆక్వా మాఫియా భాగోతం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 100 ఎకరాల సాగు భూమిని చెరువులుగా మార్చాలంటే తొలుత సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో మాత్రమే చెరువుల తవ్వకాలకు అనుమతులు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎకరానికి రూ.10 నుంచి రూ.12 వేల వరుకూ ఖర్చు పెడుతున్నారు. ఆ అనుమతులను ఆధారం చేసుకుని మొత్తం 100 ఎకరాల్లో చెరువు తవ్వకాలు పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ సిబ్బంది అయినకాడికి దండుకుంటున్నారు. తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో మిగిలిన 60 ఎకరాలకు ఎకరానికి రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వానికి చెల్లించి, మొత్తం 100 ఎకరాల చెరువుకు అధికారిక చెరువులుగా మార్చుకుంటున్నారు. దీనివల్ల మిగిలిన 60 ఎకరాల్లో ఎకరానికి రూ.10 వేల వరకూ మాఫియా మిగుల్చుకుంటోంది. ఇలా ప్రభుత్వ నిబంధనలు అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు మాఫియా కూడగడుతున్నట్టు సమాచారం.
 
ఆన్‌సైట్‌ వద్దు.. ఆన్‌లైన్‌ ముద్దు
చెరువుల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మండల కమిటీ కనీసం ఆ భూమిని క్షేత్రస్థాయిలో (ఆన్‌సైట్‌) పరిశీలించేందుకు రాదు. మామూళ్ల మత్తులో పడి ఆన్‌లైన్‌లోనే వచ్చిన దరఖాస్తులకు వారం రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా వ్యవహారమంతా ఆన్‌లైన్‌లో ముగిసిపోతోంది. చెరువుల తవ్వకాల విషయంలో సరిహద్దు రైతుల అభ్యంతరాలను సైతం అధికార గణం గాలికి వదిలేస్తోంది.
 
నోటీస్‌ బోర్డు నిబంధన ఎక్కడ
చెరువు తవ్వకాలకు అనుమతి కోరుతూ దరఖాస్తు అందితే సర్వే నంబర్లతో పూర్తి వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్‌ బోర్డులో 15 రోజులపాటు ప్రదర్శించాలి. వాటిపై వచ్చిన అభ్యంతరాలను సమీక్షించాలి. అభ్యంతరాలు ఉంటే జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నిబంధనను అధికారులు గాలికి వదిలేసారు. రెండు పంటలు పండే భూమిని చేపల చెరువులుగా మార్చడానికి అనుమతి మంజూరు చేయకూడదు. దీనికి సంబంధించి మండల వ్యవసాయ అధికారులు గడచిన 8 సంవత్సరాల పంట ఉత్పాదకతను ఉదహరించి పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో సర్వే నంబర్లకు మండల గణాంకాధికారి నుంచి పంటకోత ప్రయోగంలోని నిష్పత్తులను అనుసరించి తయారు చేసిన నివేదిక ఆధారంగా చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించకుండానే వ్యవహారం నడిచిపోతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement