
నేనిక్కడివాడినే..
రాజమండ్రి : ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్.. అంటూ సినీరంగంలో అవకాశాలకోసం వేచి చూసేవారు ఎందరో ఉంటారు. అదే తరహాలో ఒక్క అవకాశం కోసం చెన్నై వెళ్లి.. అది దక్కిన తర్వాత వెనుతిరిగి చూడని నటుడు బాలాజీ. ప్రతినాయకుడిగా, హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభ నిరూపించుకున్న నటుడు ఆయన. మన జిల్లాకే చెందిన బాలాజీ ఓ సినిమా నిర్మాణం కోసం మంగళవారం రాయవరం వచ్చారు. ఈ సందర్భంగా తన సినీ జీవిత విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
నేను ఈ జిల్లావాసినే. మండపేట మండలం ఇప్పనపాడులో పుట్టి పెరిగాను. ప్రాథమిక విద్య ఇప్పనపాడు, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ తాపేశ్వరంలో, పదో తరగతి నుంచి ఇంటర్ వరకూ అనకాపల్లిలో, డిగ్రీ నెల్లూరులో చదివాను. అనంతరం విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఆ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ‘ఓ ఆడది.. ఓ మగాడు’ సినిమాలో ప్రతినాయకుడి అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలోనే ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’లో హీరోగా చేశాను.
ఇప్పటివరకూ తెలుగు, తమిళ భాషల్లో 100 సినిమాల్లో నటించాను.
లంచావతారం, మగమహారాజు, మంగమ్మగారి మనవడు, ప్రతిధ్వని, కథానాయకుడు, అగ్నిపుత్రుడు, ధృవనక్షత్రం, కృష్ణగారడీ తదితర చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం ‘నాంది’ సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపడం లేదు.
ప్రస్తుతం టీవీ రంగంలో బాగా బిజీ అయ్యాను. బుల్లితెరకు బాలాజీ ఎంటర్‌ప్రైజస్ బ్యానర్‌పై సొంతంగా పలు సీరియల్స్ నిర్మించాను. నా బ్యానర్‌పై ఎండమావులు, కైలాసంలో కంప్యూటర్, వినాయక విజయం తదితర సీరియల్స్, టెలిఫిల్మ్స్ చేశాను.
అంతరంగాలు, పవిత్రబంధం, ఎండమావులు, ఇది కథ కాదు, రాజుగారి కూతుళ్లు, సుఖదుఃఖాలు తదితర 40 సీరియల్స్‌లో నటించాను.
తెలుగు, తమిళంలో ‘రుద్రుడు’ నిర్మించాను. సాయి సంతోష్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై ‘సోల్జియర్’ అనే సినిమాను విజయనిర్మలగారి దర్శకత్వంలో నిర్మించాను. సినిమాలతో పాటు పలు సీరియల్స్ కూడా నిర్మించాను. వీటితోపాటు ఒక టీవీ చానల్‌కు సీఈవోగా, ‘వజ్రం’ మాసపత్రికకు చీఫ్ ఎడిటర్‌గా పని చేస్తున్నాను.
నా భార్య కృష్ణవేణి గృహిణి. కుమారుడు రోహన్ హీరోగా రాబోతున్నాడు. ‘అవంతిక’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఊపిరున్నంత వరకూ నటుడిగా కొనసాగాలన్నదే నా జీవితాశయం. మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలనుంది.