- పంట పొలాల్లో పెరుగుతున్న గడ్డి
- వేధిస్తున్న కూలీల కొరత
- పెరిగిన పెట్టుబడుల
- ఆందోళనలో అన్నదాత
రైతన్నకు కలుపు కష్టాలు
Published Sat, Aug 13 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
కుంటాల : రైతన్నలకు సాగు కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లలో వర్షాలు లేక వేసిన పంట నష్టపోతే,ఈ సారి అధిక వర్షాల కారణంగా పంట పొలాల్లో గడ్డి ఎక్కువగా పెరిగింది.గడ్డిని తొలగించడానికి కూలీలు దొరక్క పక్క రాష్ట్రాల నుంచి ప్రయాణ ఖర్చులు కట్టించి కూలీలను తీసుకువస్తున్నారు.పెట్టిన పెట్టుబడిలో సగం కూలీలకే ఖర్చుచేస్తే మేమెలా బ్రతికేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటదిగుబడి రాక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.గత ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురుస్తాయన్న ధీమాతో రైతులు మ గశిర కార్తెకు ముందే విత్తనాలు వేసినా సకాలంలో వర్షాలు లేక రెండుసార్లు విత్తనాలు వేసి నష్టపోయారు.ఈఏడు ఖరీఫ్‌ను నమ్ముకుని పంటలసాగు చేసిన రైతులకు మళ్లీ చేదు అనుభవమే ఎదురవుతోంది.
పెరుగుతున్న గడ్డి
మండలంలోని ఆయా గ్రామాల్లో ఈఖరీఫ్ సీజన్‌లో 3450 హెక్టార్లలో సోయా,1750 హెక్టార్లలో వరి,16280 హెక్టార్లలో పత్తి,420 హెక్టార్లలో కందులు,150 హెక్టార్లలో మినుములు,80హెక్టార్లలో పెసళ్లు,35 హెక్టార్లలో పసుపు పంటలను సాగుచేశారు.ఈసారి మ గశిర కార్తెనుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి.మండలంలోని రైతులు పత్తితోపాటు సోయా పంటను ఈసారి అధికమొత్తంలో సాగుచేశారు.ఎడతెరిపిలేని వర్షాల వల్ల పంటలు తక్కువగా ఎదిగి గడ్డి ఏపుగా పెరిగింది.వర్షాలు కురుస్తుండడంతోపాటు గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల కలుపుతీయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు కురవని సమయంలో కలుపుతీద్దామన్నా కూలీల కొరత
రైతులను వేధిస్తోంది.గతేడాది కలుపుకు కూలీ ధర రూ.150 నుంచి 200 ఉంటే ప్రస్థుతం అదే కూలీకి రూ.250 నుంచి రూ.300 వరకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.కొందరు రైతులు ఇక్కడ కూలీలు దొరకక పోవడంతో మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువచ్చి వారికి ప్రయాణ ఖర్చులతో పాటు కూలీలను చెల్లిస్తున్నారు.పంట పెట్టుబడిలో సగం ఖర్చు కూలీలకే అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది అధికవర్షాలతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement