కొండను తవ్వి ఎలుకను పట్టారు
- రూ.50 లక్షల గోల్‌మాల్‌లో రూ.2 లక్షలే వెలుగులోకి
- మిగతా పనుల్లో అక్రమాల పరిస్థితి ఏంటి?
- టీడీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమాలు
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ అధికారులు కొండను తవ్వి ఎలకను పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనుల్లో రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయని గత నెల 24న చెప్పిన నగరపాలక సంస్థ అధికారులు ఇప్పుడు కేవలం రూ.2 లక్షల వరకే అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది నగరపాలక సంస్థ పరిధిలో రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వెచ్చించి చేపట్టిన 172 అభివృద్ధి పనులపై పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు.
ఈ పనుల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని డీఎంఏకు నివేదిక పంపారు. దాని ఆధారంగా రూ.45 నుంచి రూ.50 లక్షల వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీనిపై మళ్లీ విచారణ చేపట్టాలని ప్రస్తుత కమిషనర్ మూర్తి ఎస్‌ఈ సత్యనారాయణను ఆదేశించారు. 36వ డివిజన్‌లోని నీరు - ప్రగతి వనంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణంలో రూ.2 లక్షల వరకు గోల్‌మాల్ జరిగినట్లు ఎస్‌ఈ తేల్చారు. సంబంధిత డీఈ షుకూర్, ఏఈ మహదేవప్రసాద్‌కు ఎస్‌ఈ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు డబ్బును రికవరీ చేస్తామని చెప్పారు. ఇంకా చాలా డివిజన్లలో లోతుగా విచారణ చేపడితే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.
అయితే అలా జరక్కుండా అధికార పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ అక్రమాలు తమ మెడకు చుట్టుకుంటూ ఉండటంతో కొందరు అధికారులను పాలకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా ఇందులో నుంచి బయటపడేసేలా చూడాలని వారి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. విచారణ లోతుగా జరిగితే ఏఈ, డీఈలను సస్పెన్షన్ చేసేందుకు డీఎంఏకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా వారి నుంచి భారీ మొత్తంలో రికవరీ చేయాల్సి వస్తుంది. అయితే అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలున్న నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి.