
కాటేసిన కల్తీ కల్లు
– ఇద్దరు యువకుల మృతి
– మాధవరంలో విషాదం
– ఫిర్యాదు చేయలేదంటున్న ఎకై ్సజ్ అధికారులు
మంత్రాలయం:కల్తీ కల్లు రెండు నిండు జీవితాలను బలిగొంది. మంత్రాలయం మండలంలో ఇద్దరు కల్తీ కల్లు తాగి మృత్యువాత పడ్డారు. మాధవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రాఘవేంద్రగౌడ్ (25) కొంతకాలంగా కల్లు తాగుతున్నారు. ఆదివారం రాత్రి వరకు మాధవరం దుకాణంలో కల్లు అతిగా తాగాడు. అనంతరం దుకాణం వెనకభాగం నుంచి ఇంటికి వెళ్తుండగా చింతచెట్టు కింద పడిపోడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మంత్రాలయానికి చెందిన పెయింటర్ ఉరకుంద (28) ఆదివారం రాత్రి చెట్నెహళ్లి గ్రామంలోని కల్లుదుకాణంలో కల్లుతాగి ఇంటి ముఖం పట్టాడు. మార్గ మధ్యలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ కుప్పకూలి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారమంతా కష్టించి పనిచేసిన కూలీలు ఆదివారం మద్యం తాగడం పరిపాటి. వ్యాపారాన్ని పెంచుకునేందుకు కల్లులో మత్తు మందు శాతం పెంచేస్తున్నారు. కల్లు ఎక్కువగా తాగుతారన్న గ్రహించి కల్తీకి తెర తీస్తున్నారు. మిగతా రోజులకంటే ఆదివారం ఎక్కువగా ఇక్కడ కల్లు విక్రయాలు సాగుతున్నాయి. అలసిన కూలీలకు కల్తీ మత్తెక్కించి ప్రాణాలు తీస్తున్నారు. కల్లు వ్యాపారులతో కుమ్మక్కై కల్తీ కల్లు నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫమయ్యారని విమర్శిస్తున్నారు.
కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం:
మంత్రాలయం మండలంలో కల్తీకల్లు తాగి మృతి చెందుతున్నా వెలుగులోకి రాకుండా ఎక్సైజ్ అధికారులు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఉరుకుంద కూడా మూర్చవ్యాధితో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు లిఖిత పూర్వకంగా రాసిచ్చిలా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. స్థానికులు మాత్రం కల్తీ కల్లు కారణంగానే ఇద్దరు మృత్యువాత పడ్డారని చెబుతున్నారు. గతంలో మాధవరం, చెట్నెహళ్లి గ్రామాల్లో కల్తీ కల్లు బారిన పడి మృతి చెందినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కల్లు దుకాణదారులకు వత్తాసు పలుకుతూ కేసును తప్పదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కల్లు శాంపిల్స్ సేకరించాం : దుర్గప్ప, ఎకై ్సజ్ సీఐ, ఎమ్మిగనూరు
కల్తీ కల్లు మరణాలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మాకు సమాచారం తెలియడంతో ఆదివారం ఉదయం ఎమ్మిగనూరులోని రామ్మూర్తి కల్లు డిపోలో శాంపిల్స్ సేకరించాం. కర్నూలు పరీక్ష కేంద్రానికి నమూనాలు పంపించాం. కల్తీ జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం.