–ఏ ఆఫీసుకెళ్లినా ఇదే సమాధానం
– కలెక్టరేట్‌లో స్తంభించిన పాలన
– కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లు
– ఈ సేవా కేంద్రాల్లో నిలిచిన సర్టిఫికెట్ల జారీ
– మూడ్రోజుల్లో 25 పైగా దొంగతనాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
జిల్లాకు జిల్లా కదిలింది. కీలకమైన అధికారులంతా పుష్కర విధులకు వెళ్లారు. కలెక్టర్ మొదలుకుని మండల రెవిన్యూ అధికారులంతా కృష్ణా పుష్కరాల బాట పట్టారు. జిల్లా నుంచి ఏకంగా 3500 మంది ఉద్యోగులు పుష్కర విధులకు హాజరయ్యారు. దీంతో వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లోని రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల కార్యాలయాలన్నీ వెలవెలబోతున్నాయి. వివిధ రకాల పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకొచ్చే గ్రామీణ జనం ఖాళీ సీట్లు చూసి తిరుగు ముఖం పడుతున్నారు.
ఎక్కడో రెండు జిల్లాల అవతల జరిగే కృష్ణాపుష్కరాలకు జిల్లా నుంచి ఓ 500 మందికి డ్యూటీలు పడే అవకాశముందని మొదట్లో అనుకున్నారు. సీఎం చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన ముగిశాక ఈ సంఖ్య 3500 కు చేరింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే పుష్కరాలకు ఎక్కువ మొత్తంలో అధికారులను పంపాలని సీఎం సూచించడంతో ఈ మేరకు ఎక్కువ మందికి పుష్కర విధులు కేటాయించారు. జిల్లా నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు, 11 మంది డిప్యూటీ కలెక్టర్లు, 15 మంది తహశీల్దార్లు, 11 మంది డిప్యూటీ తహశీల్దార్లు వెళ్లారు. వీరు మాత్రమే కాకుండా మున్సిపల్ పరిపాలన, వైద్య ఆరోగ్యం, పీఆర్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖల నుంచి మరో 500 మందికి పైగా వెళ్లారు. ఇకపోతే అర్బన్ జిల్లాలో 1201, చిత్తూరు జిల్లాలో 1600 మంది పోలీసులు పుష్కరాలకు వెళ్లారు. దీంతో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఏకంగా పోలీసులమంటూ బుధవారం అర్థరాత్రి కొర్లగుంటలోని మెయిన్‌రోడ్డులోని ఓ కార్యాలయంలో రూ.3.23 లక్షల నగదు, 140 గ్రాముల బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడ్డారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా గడచిన మూడు రోజుల్లో 25కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఇకపోతే కలెక్టరేట్, వ్యవసాయశాఖ, హార్టికల్చర్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలకు వివిధ పనుల మీద వచ్చే జనానికి అధికారులు లేరన్న సమాధానం ఎదురవుతోంది. ఏ పనైనా...ఎంత అర్జంటైనా పుష్కరాల తర్వాతే కలవండని కార్యాలయాల్లోని సిబ్బంది ముఖానే చెప్పేస్తున్నారు. పట్టణాల్లోని ఈ సేవా కేంద్రాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి వంటి ప్రధాన పట్టణాల్లో సిగ్నల్స్ దగ్గర కానిస్టేబుళ్లు లేక వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. జిల్లాలోని పలు రోడ్డు మార్గాల్లో పోలీసుల తనిఖీలు లేక ఎర్ర స్మగ్లర్ల అక్రమ రవాణా పెరిగింది.
పేరుకుపోయిన ఫైళ్లు
అటు కలెక్టరేట్‌లోనూ, ఇటు మండల కార్యాలయాల్లోనూ ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైళ్లు పేరుకుపోయాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తుడా వీసీగా వ్యవహరించే వినయ్‌చంద్ లేకపోవడంతో నగరంలో పాలన స్తంభించింది. కమిషనర్ సంతకం లేనిదే ఏ ఫైలూ కదిలే పరిస్థితి లేదు. శానిటరీ సూపర్‌వైజర్లకు కూడా కృష్ణా పుష్కర విధులు కేటాయించారు. నగరంలో వీరి పర్యవేక్షణ లేకపోతే శానిటేషన్ పరంగా ఇబ్బందులు తలెత్తడం ఖాయం. విభాగాల పాలనలను చూస్తోన్న నలుగురు సూపరింటెండెంట్‌లను సైతం పుష్కర వి«ధులకు కేటాయించారు. దీనివల్ల సాధారణ పరిపాలన, ఇంజినీరింగ్ విభాగంలో పెద్ద ఎత్తున ఫైళ్లు నిలిచిపోయాయి.