‘కాళ్లవాపు’పై కదలిక
-
అన్నవరానికి వైద్య నిపుణుల బృందం
-
బాధితుల రక్త నమూనాల సేకరణ
-
కాకినాడకు జీజీహెచ్‌కు తరలింపు
వీఆర్‌పురం :
‘మరణశయ్యపై మన్యం’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చిం ది. అంతుపట్టని కాళ్లవాపు వ్యాధితో వీ ఆర్‌పురం మండలం అన్నవరం గ్రామంలో 20 రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు, మరో గ్రామంలో మరొకరు మృతి చెందగా, అవే లక్షణాలతో మరి కొందరు మంచాన పడ్డ సంగతి తెలిసిందే. గిరిజనులను గజగజ వణికిస్తున్న ఈ వ్యాధిపై కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శాఖ అధికారులు అన్నవరంపై దృష్టి సారించారు. అసలు ఈ వ్యాధికి మూలమేమిటో నిర్ధారించేందుకు సమాయత్తమవుతున్నారు. నిపుణులు గ్రామానికి వచ్చి పలువురి రక్త నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ఈ బృందాలు కొన్ని రోజులు ఇక్కడే ఉండి చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్‌కిషోర్, రంపచోడవరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కార్తీక్, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ తదితరులు అన్నవరం వచ్చి వివరాలు సేకరించారు. కాళ్ల వాపుతో బాధపడుతున్న 20 మందిని రెండు ప్రత్యేక అంబులెన్స్‌లలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.