ఎస్వీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు
– అందని రీయింబర్స్‌మెంట్
– ఆందోళనకు దిగిన విద్యార్థులు
– సీఎంను అడ్డుకుంటామని హెచ్చరిక
యూనివర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల్లో పీజీ చేస్తున్న విద్యార్థులకు 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు రాలేదు. అంతే కాకుండా 2016–17 సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవటానికి ఈ–పాస్‌లో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల వారు దరఖాస్తు చేసుకోవటానికి వీలుగా సంబంధిత ఆప్షన్ రావడం లేదు. దీంతో విద్యార్థులు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. 10 విభాగాలకు చెందిన సుమారు 500మంది విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని పలుమార్లు అధికారుల దష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు గురువారం ఎస్వీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ భవిష్యత్‌తో అధికారులు ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. రెన్యువల్‌కు తుది గడువు శుక్రవారం(30వ తేదీ)తో ముగుస్తుందని, తాము దరఖాస్తు చేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–పాస్ వెబ్‌సైట్ పర్యవేక్షిస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని వారు వాపోయారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే అక్టోబర్ 2న ఎస్వీయూ స్టేడియంలో జరిగే సీఎం చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం క్యాంపస్ కమిటీ అధ్యక్షుడు మురళీధర్, విద్యార్థి నాయకులు హేమంత్ కుమార్‌రెడ్డి, నరేంద్ర, నవీన్‌గౌడ్, అభిషేక్, సోమునాయక్, కోటీనాయక్, సాయి,రవి పాల్గొన్నారు.