అగ్నిమాపకం.. అధునాతనం
అగ్నిమాపకం.. అధునాతనం
Published Thu, Mar 30 2017 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భీమవరం టౌన్: ‘ఫైర్’ విజన్ మారుతోంది. అగ్నిమాపకశాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, హజార్డ్ వెహికల్స్, గజఈత గాళ్లను సిద్ధం చేస్తోంది. నైపుణ్యం, వేగంతో కూడిన సేవలందించడమే అగ్నిమాపకశాఖ లక్ష్యంగా డీజీ కె.సత్యనారాయణ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఆధునిక వాహనం, పరికరాలను సమకూర్చుతూ మరోవైపు ప్రజలతో మమేకమవుతున్నారు. అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలో శిక్షణ ఇస్తూ అగ్నిమాపక శాఖకు సహాయపడేలా స్వచ్ఛంద వలంటీర్లను తయారుచేస్తున్నారు. ఆధునిక అగ్నిమాపక వాహనాలు, సంఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు ఇరుకు సందుల్లోకి కూ డా వెళ్లగలిగే మిస్ట్ జీప్‌లు, ఆక్సిజన్ సిలెండర్లతో కూడిన మిస్ట్ బుల్లెట్లు, నీట మునిగిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బోట్‌లు సమకూర్చుకుంటూ మరోవైపు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దిశగా దృష్టి సారించింది.
స్పెషల్ టాస్క్‌ఫోర్స్
అగ్నిమాపక శాఖకు ప్రతి జిల్లాలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నారు. జిల్లాకు 20 మంది సిబ్బంది టాస్క్‌ఫోర్స్‌లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోడ్డు, రైలు ప్రమాదాలు, పరిశ్రమలు తదితర చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకునేలా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ రెస్క్యూ వాహనాల ద్వారా సేవలందించనున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రాల్లో టాస్క్‌ఫోర్స్ సభ్యులు శిక్షణ పొందుతున్నారు.
హజ్మత్ వెహికల్
రసాయనిక అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నివారించేందుకు ప్రత్యేక సూట్లు, ఆధునిక పరికరాలు ఉన్న వాహనాలను సిద్ధం చేస్తున్నారు. రసాయనిక అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సిబ్బంది ప్రత్యేక సూట్లు ధరించి ఆధునిక పరికరాలతో ప్రమాదాన్ని నివారించడం లక్ష్యంగా హజ్మత్ ప్రణాళిక రచించారు.
గజ ఈతగాళ్లు
అగ్నిమాపకశాఖ గజ ఈతగాళ్లకు శిక్షణ ఇస్తోంది. జిల్లాకు పది మంది వంతున రాష్ట్రంలో 120 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి నదులు, సముద్రాల్లో ఈతలో శిక్షణ ఇస్తారు. తొలిదశలో 40 మంది గజ ఈతగాళ్లకు విజయవాడలో శిక్షణ పూర్తయ్యింది. తర్వాత ఒడిసా, కోల్‌కతాలో శిక్షణ ఇవ్వనున్నారు. అగ్నిమాపక శాఖలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుని నూతన విధానాలపై కింది స్థాయి అధికారులతో చర్చించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధి రీజినల్ అగ్నిమాపక శాఖ అధికారి ఎస్‌వీ చౌదరి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
Advertisement