controll
-
రెండేళ్లలో 25 డేటా సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్–ఎస్ 2025 మార్చి నాటికి కేంద్రాల సంఖ్యను 25కు చేరుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 డేటా సెంటర్లు ఉన్నాయి. రెండేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం తోడవనుంది. ప్రస్తుతం నవీ ముంబైలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ డేటా సెంటర్ పార్క్ నిర్మాణంలో ఉంది. ఇదే స్థాయిలో హైదరాబాద్ కేంద్రం నిర్మాణానికి సిద్ధంగా ఉందని కంట్రోల్–ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చెన్నై డేటా సెంటర్ పనులు మొదలయ్యాయి. ఈ మూడు కేంద్రాల చేరికతో 600 మెగావాట్ల సామర్థ్యం సంస్థకు జతకూడనుంది. కోల్‌కతలో సైతం ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. రేటెడ్–4 డేటా సెంటర్ల నిర్వహణలో కంట్రోల్–ఎస్ ఆసియాలో తొలిస్థానంలో ఉంది. -
పీటలపై పుత్తడి బొమ్మలు
పాలబుగ్గల పసిపిల్లలు పుత్తడి బొమ్మలుగా మారుతున్నారు. పేదరికం...నిరక్షరాస్యత..కుల కట్టుబాట్లు... గతించిన సంప్రదాయలు.... అభంశుభం తెలియని ఆడపిల్లల జీవితాలను బలి చేస్తున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులను పెళ్లి పీటలు ఎక్కించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వందలాది బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. వారు పసి మొగ్గలు. స్నేహితుల ఆటపాటలతో సంతోషాల సాగరంలో ఓలలాడే ఉల్లాసజీవులు. అక్షర వర్ణమాల వ్యాకరణాలతో కుస్తీ పట్టే చిరు దివ్వెలు. ప్రతి ఇంటా సిరులు కురిపించే సౌభ్యాగ్య ప్రదాయినిలు. అటువంటి అభం శుభం తెలియని ఆ చిట్టి చేతులను ఓ అయ్య చేతిలో పెట్టి పెళ్లిళ్లు చేసేస్తూ వారిని నరకప్రాయంలోకి నడిపిస్తున్నారు. సాక్షి, మచిలీపట్నం : నిరుపేద కుటుంబంలో పాప పుట్టడం చేసిన పాపమో.. సాకలేక ఓ అయ్య చేతిలో పెట్టడం అమ్మానాన్నల నేరమో.. సంప్రదాయం మాటున అజ్ఞానమో.. కారణాలు ఏవైనా కావచ్చు జరుగుతున్నవి మాత్రం ఘోరాలే.. ఇందుకు జిల్లాలో గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతుంది. జిల్లాలో ఏటా అనధికారికంగా 100 నుంచి 150 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో వెలుగులోకి వచ్చినవి మాత్రం 80 నుంచి 100కు లోపే ఉంటున్నాయి. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తంతు. 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే 457 వివాహాలను ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళల్లో పెళ్లి చేసే వయస్సును అంతర్జాతీయ సంస్థలు ఒక అధ్యయనం ప్రకారం 18 ఏళ్లుగా నిర్ణయించారు. అంతకు తక్కువ వయస్సులో వివాహం జరిపిస్తే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేక బహుళ నష్టాలు కలుగుతాయని అంతర్జాతీయ ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. బాలికల్లో ఆరోగ్య క్షీణత, పుట్టుకతోనే పిల్లల్లో లోపాలు వస్తాయి. ఇది తర్వాతి తరాలైనా ప్రభావం చూపుతాయని తెలిసినా పెళ్లిళ్లు జరగడం విస్మయం కలిగిస్తోంది. ఏయే ప్రాంతాల్లో ఎక్కువంటే.. జిల్లా వ్యాప్తంగా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, మైలవరం, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల పరిధిలో మత్స్యకార కుటుంబాలు, గిరిజన తండాలు, మరికొన్ని బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో ఇప్పటికీ బాల్య వివాహాల ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. కారణాలు అనేకం..! పేదరికం, ఆడ పిల్లలను భారంగా భావించడం, పెద్దల నిరక్షరాస్యత కారణంగా పిల్లలను చదివించాలనే తలంపు లేకపోవడం, అనర్థాలపై అవగాహన లేకపోవడంతో జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరగడానికి కారమణమవుతున్నాయి. దీనికి గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలు పావులుగా మారుతున్నారు. వారి తల్లి దండ్రులు పిల్లలను పోషించే స్థోమత లేకపోవడంతో ఏదో పెళ్లి చేసేయాలనే ఆలోచన చేస్తున్నారు. నాగాయలంక, కోడూరు, బందరు, కైకలూరు, లంక ప్రాంతాల్లో నివశించే వారిలో ఈ తరహా అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరక్షరాస్యత, కులవృత్తిపై ఆధారపడే కుటుంబాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కైకలూరు మండలం కొల్లేరుకు చెందిన 16 ఏళ్ల బాలికను గూడూరు మండలం రాయవరం గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న వ్యక్తికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలోని బాలిక నానమ్మ ఇంటి వద్ద పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం కాస్త ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న సీడీపీవో దీప్తి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఎస్ఐ శ్రీనివాస్, సర్పంచ్, అంగన్వాడీ సూపర్ వైజర్ జాహేదాలు వివాహాన్ని అడ్డుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటన కేవలం ఇదొక్కటే కాదు.. జిల్లా వ్యాప్తంగా నిత్యకృత్యంగా మారాయి. విధిగా సమాచారమివ్వాలి బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే మనకెందుకు అని ఊరుకోకుండా విధిగా పోలీసులు, బాలిక సంరక్షణ అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వివాహం జరిగిపోయిన తర్వాత కూడా బాలిక సంరక్షణ అధి కారులకు సమాచారం అందిస్తే.. ఆ వివాహాన్ని రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంది. జిల్లా మెజిస్ట్రేట్ నిలిపివేత ఉత్తర్వులు ద్వారా వివాహాన్ని రద్దు చేయవచ్చు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సెక్షన్ 151/సీఆర్పీసీ ప్రకారం దర్యాప్తు ఆరంభించాలి. బలవంతంగా వివాహం చేస్తున్నట్లు తేలితే కఠిన చట్టాలు అమల్లోకి వస్తాయి. బాల్యవివాహాల నిర్మూలనకు 2006లో వచ్చిన చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం పెద్దలు, సంరక్షకులు, పెళ్లికి అంగీకరించిన వరుడు, సాక్షులు అందరూ శిక్షార్హులే. కఠిన చట్టాలు అమల్లో ఉన్నా బాల్యవివాహాల నిర్మూలనపై ప్రచారం జరగడం లేదు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేసి వివాహాలను అడ్డుకుంటున్నాం. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. –కృష్ణకుమారి, ఐసీడీఎస్ పీడీ -
వేగానికి కళ్లెం!
మర్రిపాలెం(విశాఖ ఉత్తర) : ప్రభుత్వం నిర్దేశించిన వేగం దాటి ప్రయాణిస్తే ఇక కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రయాణిస్తున్న రోడ్లు, వినియోగిస్తున్న వాహనాల ఆదారంగా గరిష్ఠ వేగాన్ని నిర్ణయించారు. ‘మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్’ కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వాహనం ఎంత వేగంతో ప్రయాణించాలి! ఆయా రోడ్లకు తగ్గట్టుగా వేగం ఎంత ఉండాలి! అనేది ప్రకటించారు. సెక్షన్ 122 మోటార్ వాహనాల చట్టం 1988 9(58 నుంచి 1988) జీవోలో ఆంక్షలు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆయా ప్రాంతాలలో వాహనం నిర్దేశించిన వేగంతో ప్రయాణించాలనే ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన వేగాన్ని మించకుండానే వాహనాలు ప్రయాణించాలనే ఆజ్ఞలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా ఆయా రోడ్లకు తగ్గట్టుగా ఒకే వేగంతో వాహనాలు ప్రయాణించాలనే లక్ష్యంతో నూతన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చారు. వేగ నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద ఎప్పటి వలే అపరాధ రుసుం వసూలు చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. అతి వేగంతోనే ప్రమాదాలు అతివేగం అత్యంత ఘోర ప్రమాదాలకు కారణమవుతోంది. కట్టుదిట్టంగా చట్టంలో నిబంధనలు లేకపోవడం... ఉన్న నియమాలు కచ్చితంగా అమలు చేయలేని నిస్సహాయ పరిస్థితి వల్ల రోడ్డు విశాలంగా కనిపించగానే వాహనదారులు అపరిమిత వేగంతో దూసుకుపోతున్నారు. ఇలా ప్రయాణిస్తూ ప్రమాదాలను స్వాగతిస్తున్నారు. మన దేశంలో ఎటా ప్రమాదాల్లో సుమారు 60 వేల మందికిపైగా చనిపోతుండగా సుమారు ఐదు లక్షల మంది క్షతగాత్రులవుతున్నారు. మన విశాఖపట్నం జిల్లాలో 2016లో 2,413 ప్రమాదాలు సంభవిస్తే 754 మంది ప్రాణాలు పోగొట్టుకోగా 2,539 మంది గాయపడ్డారు. 2017లో 2,072 ప్రమాదాలు జరిగితే 595 మంది మృతి చెందగా 2,303 మంది గాయాలపాలయ్యారు. జరుగుతున్న ప్రమాదాలను రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తే... అతి వేగం ప్రధాన కారణమని సర్వేలలో తేలింది. ముఖ్యంగా యువత వాయువేగంతో దూసుకెళుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు పరిశోధనలలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాహనాల వేగం నియంత్రిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టవచ్చనే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ వేగం దాటితే చర్యలు దేశ వ్యాప్తంగా ఆయా రోడ్లలో వాహనం ఎంత వేగంతో ప్రయాణించాలి అనేది ఉత్తర్వులలో స్పష్టం చేశారు. రోడ్లతోపాటు ఆయా వాహనాల తరగతి ఆధారంగా వేగం నిర్ణయించారు. అంతకు మించిన వేగంతో ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎక్స్‌ప్రెస్ హైవేలలో 8 సీటర్‌లోపు గల ప్యాసింజర్ తరహా వాహనాలు గంటకు 120 కి.మీ, 9 సీటర్ సామర్థ్యం మించిన ప్యాసింజర్ వాహనాలు గంటకు 100 కి.మీ, రవాణా తరహా వాహనాలు గంటకు 80 కి.మీ, మోటార్ సైకిళ్లు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించాలి. నాలుగు లైన్లు అంతకు మించిన హైవే రోడ్లలో 8 సీటర్‌లోపు ప్యాసింజర్ వాహనాలు గంటకు 100 కి.మీ, 9 సీటర్‌కు మించిన ప్యాసింజర్ వాహనాలు గంటకు 90 కి.మీ, రవాణా తరహా వాహనాలు గంటకు 80 కి.మీ, మోటార్ సైకిళ్లు గంటకు 80 కి.మీ, ఆటోలు గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణించాలని నిర్దేశించారు. మున్సిపల్ రోడ్లు మీద 8 సీటర్‌లోపు ప్యాసింజర్ తరహా వాహనాలు గంటకు 70 కి.మీ, 9 సీటర్‌కు మించిన ప్యాసింజర్ వాహనాలు గంటకు 60 కి.మీ, రవాణా తరహా వాహనాలు గంటకు 60 కి.మీ, మోటార్ సైకిళ్లు గంటకు 60 కి.మీ, ఆటోలు గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణించాలని ప్రకటించారు. -
బెల్ట్ తీసేదెప్పుడో?
గుర్ల : గ్రామాల్లో గుక్కెడు నీరు దొరకడం ఏమో గానీ, మద్యం దొరకని ప్రాంతం లేదు. బెల్టుషాపులను పూర్తిగా నివారిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి విస్తరణకు పూనుకుంటుంది. మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం బెల్టు షాపులను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గుర్ల మండలమే చక్కని ఉదాహరణ. మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. మండల పరిధిలోనున్న గుర్ల, కోటగండ్రేడు, అచ్యుతాపురంలోనున్న నాలుగు మద్యం షాపుల ద్వారా అమ్మకాలు జరపాలని అధికారులు లైసెన్స్‌లు మంజూరు చేశారు. మండలంలోని 37 పంచాయతీలకు ఏదో ఒక మార్గం ద్వారా ఈ నాలుగు షాపుల నుంచి మద్యం బెల్టు షాపులకు సరఫరా అవుతుంది. గ్రామాల్లో మద్యం అమ్మకాలు వద్దంటూ పలుసార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహిళలు ఆందోళన మేరకు గ్రామాల్లో రెండు, మూడు వారాలు పాటు అధికారులు మద్యం నిషేధించారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, షాపు యజమానులకు అధికారులతో పరిచయం వల్ల కొద్ది రోజుల వ్యవధిలోనే యథావిధిగా బెల్టుషాపుల్లో మద్యం అమ్ముకుంటున్నారని గ్రామస్తులు నుంచి ఆరోపణలు వినపడుతున్నాయి. బెల్ట్ షాపులు నడుపుతున్న విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. బెల్టు షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్‌శాఖ అధికారులు గంభీరం వ్యక్తంచేసిన అందులో వాస్తవం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నన్స్ సొసైటీ) ఇచ్చిన సమాచారంలో మండలంలో ఎక్కడా బెల్టు షాపులు నిర్వహించలేదనే నివేదికను అధికారులు పంపించారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తే అసలు విషయం బయటకు వస్తుందని గ్రామస్తులు చెబుతు న్నారు. బెల్టు షాపుల్లో ముద్రిత ధరలకు కాకుండా అధిక రేట్లుకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మండల శివారు ప్రాంతాలైనా పకీరు కిట్టాలి, కోండగండ్రేడు, దేవునికణపాక గ్రామాల్లో బెల్ట్ షాపులకు ప్రత్యామ్నాయంగా సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో మందుబాబులు జోరు ఆరికట్టాలంటే బెల్ట్ షాపులు నియంత్రణ అవసరమని ప్రజలంటున్నారు. ఎక్సైజ్ అధికారులు తూతుమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పంధించి గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను నిషేధించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. స్థానిక పోలీసులే నయం స్థానిక పోలీసులు దాడులు చేసి బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నారు తప్ప ఎక్స్‌జ్ పోలీసులు మాత్రం ఎక్కడా బెల్ట్ షాపులపై దాడి చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా వ్యక్తి బెల్ట్ షాపు నడుపుతున్నట్లు ఎక్స్‌జ్ అ«ధికారులకు సమాచారం ఇస్తే వారి వివరాలను బెల్ట్ షాపు నిర్వహకులకు తెలియజేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ విషయంపై నెల్లిమర్ల ఎక్సైజ్ సీఐ శైలాజారాణి వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. బెల్ట్ షాపులను నిర్ములించాలి మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రంలోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. – చింతపల్లి అప్పారావు, బీజేపీ నాయకుడు, గుర్ల దాడులు చేస్తున్నాం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై తరుచూ దాడులు చేస్తున్నాం. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నిర్వహకులపై కేసులు నమోదు చేస్తున్నాం. – సంభాన రవి, ఎస్ఐ, గుర్ల -
అగ్నిమాపకం.. అధునాతనం
భీమవరం టౌన్: ‘ఫైర్’ విజన్ మారుతోంది. అగ్నిమాపకశాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, హజార్డ్ వెహికల్స్, గజఈత గాళ్లను సిద్ధం చేస్తోంది. నైపుణ్యం, వేగంతో కూడిన సేవలందించడమే అగ్నిమాపకశాఖ లక్ష్యంగా డీజీ కె.సత్యనారాయణ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఆధునిక వాహనం, పరికరాలను సమకూర్చుతూ మరోవైపు ప్రజలతో మమేకమవుతున్నారు. అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలో శిక్షణ ఇస్తూ అగ్నిమాపక శాఖకు సహాయపడేలా స్వచ్ఛంద వలంటీర్లను తయారుచేస్తున్నారు. ఆధునిక అగ్నిమాపక వాహనాలు, సంఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు ఇరుకు సందుల్లోకి కూ డా వెళ్లగలిగే మిస్ట్ జీప్‌లు, ఆక్సిజన్ సిలెండర్లతో కూడిన మిస్ట్ బుల్లెట్లు, నీట మునిగిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బోట్లు సమకూర్చుకుంటూ మరోవైపు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దిశగా దృష్టి సారించింది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అగ్నిమాపక శాఖకు ప్రతి జిల్లాలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నారు. జిల్లాకు 20 మంది సిబ్బంది టాస్క్‌ఫోర్స్‌లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోడ్డు, రైలు ప్రమాదాలు, పరిశ్రమలు తదితర చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకునేలా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ రెస్క్యూ వాహనాల ద్వారా సేవలందించనున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రాల్లో టాస్క్‌ఫోర్స్ సభ్యులు శిక్షణ పొందుతున్నారు. హజ్మత్ వెహికల్ రసాయనిక అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నివారించేందుకు ప్రత్యేక సూట్లు, ఆధునిక పరికరాలు ఉన్న వాహనాలను సిద్ధం చేస్తున్నారు. రసాయనిక అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సిబ్బంది ప్రత్యేక సూట్లు ధరించి ఆధునిక పరికరాలతో ప్రమాదాన్ని నివారించడం లక్ష్యంగా హజ్మత్ ప్రణాళిక రచించారు. గజ ఈతగాళ్లు అగ్నిమాపకశాఖ గజ ఈతగాళ్లకు శిక్షణ ఇస్తోంది. జిల్లాకు పది మంది వంతున రాష్ట్రంలో 120 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి నదులు, సముద్రాల్లో ఈతలో శిక్షణ ఇస్తారు. తొలిదశలో 40 మంది గజ ఈతగాళ్లకు విజయవాడలో శిక్షణ పూర్తయ్యింది. తర్వాత ఒడిసా, కోల్‌కతాలో శిక్షణ ఇవ్వనున్నారు. అగ్నిమాపక శాఖలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుని నూతన విధానాలపై కింది స్థాయి అధికారులతో చర్చించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధి రీజినల్ అగ్నిమాపక శాఖ అధికారి ఎస్వీ చౌదరి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.