బెల్ట్ షాపు నిర్వహకుల నుంచి గుర్ల పోలీసులు పట్టకున్న మద్యం సీసాలు(ఫైల్)
గుర్ల : గ్రామాల్లో గుక్కెడు నీరు దొరకడం ఏమో గానీ, మద్యం దొరకని ప్రాంతం లేదు. బెల్టుషాపులను పూర్తిగా నివారిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి విస్తరణకు పూనుకుంటుంది. మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం బెల్టు షాపులను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గుర్ల మండలమే చక్కని ఉదాహరణ. మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. మండల పరిధిలోనున్న గుర్ల, కోటగండ్రేడు, అచ్యుతాపురంలోనున్న నాలుగు మద్యం షాపుల ద్వారా అమ్మకాలు జరపాలని అధికారులు లైసెన్స్‌లు మంజూరు చేశారు. మండలంలోని 37 పంచాయతీలకు ఏదో ఒక మార్గం ద్వారా ఈ నాలుగు షాపుల నుంచి మద్యం బెల్టు షాపులకు సరఫరా అవుతుంది.
గ్రామాల్లో మద్యం అమ్మకాలు వద్దంటూ పలుసార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహిళలు ఆందోళన మేరకు గ్రామాల్లో రెండు, మూడు వారాలు పాటు అధికారులు మద్యం నిషేధించారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, షాపు యజమానులకు అధికారులతో పరిచయం వల్ల కొద్ది రోజుల వ్యవధిలోనే యథావిధిగా బెల్టుషాపుల్లో మద్యం అమ్ముకుంటున్నారని గ్రామస్తులు నుంచి ఆరోపణలు వినపడుతున్నాయి. బెల్ట్ షాపులు నడుపుతున్న విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. బెల్టు షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్‌శాఖ అధికారులు గంభీరం వ్యక్తంచేసిన అందులో వాస్తవం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నన్స్ సొసైటీ) ఇచ్చిన సమాచారంలో మండలంలో ఎక్కడా బెల్టు షాపులు నిర్వహించలేదనే నివేదికను అధికారులు పంపించారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తే అసలు విషయం బయటకు వస్తుందని గ్రామస్తులు చెబుతు న్నారు. బెల్టు షాపుల్లో ముద్రిత ధరలకు కాకుండా అధిక రేట్లుకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మండల శివారు ప్రాంతాలైనా పకీరు కిట్టాలి, కోండగండ్రేడు, దేవునికణపాక గ్రామాల్లో బెల్ట్ షాపులకు ప్రత్యామ్నాయంగా సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో మందుబాబులు జోరు ఆరికట్టాలంటే బెల్ట్ షాపులు నియంత్రణ అవసరమని ప్రజలంటున్నారు. ఎక్సైజ్ అధికారులు తూతుమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పంధించి గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను నిషేధించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు.
స్థానిక పోలీసులే నయం
స్థానిక పోలీసులు దాడులు చేసి బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నారు తప్ప ఎక్స్‌జ్ పోలీసులు మాత్రం ఎక్కడా బెల్ట్ షాపులపై దాడి చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా వ్యక్తి బెల్ట్ షాపు నడుపుతున్నట్లు ఎక్స్‌జ్ అ«ధికారులకు సమాచారం ఇస్తే వారి వివరాలను బెల్ట్ షాపు నిర్వహకులకు తెలియజేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ విషయంపై నెల్లిమర్ల ఎక్సైజ్ సీఐ శైలాజారాణి వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
బెల్ట్ షాపులను నిర్ములించాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రంలోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు.
– చింతపల్లి అప్పారావు, బీజేపీ నాయకుడు, గుర్ల
దాడులు చేస్తున్నాం
బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై తరుచూ దాడులు చేస్తున్నాం. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నిర్వహకులపై కేసులు నమోదు చేస్తున్నాం.
– సంభాన రవి, ఎస్‌ఐ, గుర్ల
Comments
Please login to add a commentAdd a comment