
గాలి వాన బీభత్సం
– కూలిన పేపర్ పరిశ్రమ పైకప్పు
– ముద్దిరెడ్డిపల్లిలో ఆవు మృతి
– తూముకుంటలో రేషం షెడ్లు «ధ్వంసం
హిందూపురం రూరల్ : హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించాయి. హిందూపురం పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తాకిడికి పరిశ్రమ, రేషం షెడ్ల పైకప్పులు ధ్వంసం కాగా విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. తూముకుంట గ్రామంలో ఈదురు గాలులకు శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డికి చెందిన రేషం షెడ్లకు చెందిన సిమెంట్ రేకులు ధ్వంసమయ్యాయి. చంద్రికల్లో వేసిన పట్టు పురుగులు పూర్తిగా దెబ్బ తిని రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు వాపోయారు.
అదేవిధంగా బసవనపల్లిలో లోటస్ పేపర్ పరిశ్రమ పైకప్పు అల్యూమినియం రేకులు గాల్లో తేలాడుతూ పాఠశాల మైదానంలో ఎగిరిపడ్డాయి. పరిశ్రమలో ముడిసరుకు వర్షానికి తడిసి పూర్తిగా యంత్రాలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు పరిశ్రమ యాజమాని జయమ్మ వాపోయింది. బసవనపల్లి సమీపంలో 12 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌కో సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. పట్టణంలోని ముద్దిరెడ్డిగపల్లిలో ఉరుముల దెబ్బకు రూ.70 వేలు విలువ చేసే పాడి ఆవు మృత్యువాత పడిందని బాధిత రైతు నాగరాజు వాపోయాడు.
నష్ట పరిహారం కోసం తహాసీల్దారుకు వినతి
ఈదురు గాలుల బీభత్సానికి రేషం పంట చేతికి అందకుండా పోయిందని తూముకుంట రైతులు శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి వాపోయారు. చంద్రికల్లో వేసిన రేషం పురుగులు గాలివాన బీభత్సానికి ఇద్దరికి సుమారు రూ.1.40 లక్షలు నష్టం వాటిల్లిదని ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించుకున్నారు.