పథకం ప్రకారమే కాపుల అణచివేత చర్యలు
పథకం ప్రకారమే కాపుల అణచివేత చర్యలు
Published Thu, Jan 26 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
పాదయాత్రకు కోర్టు అనుమతి ఉన్నా అడ్డుకున్నారు
సుప్రీం కోర్టు నిషేధించినా కోడిపందేలకు ఓకే చెప్పారు
ఇదేనా మీ ద్వంద్వ నీతి
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆకుల రామకృష్ణ ధ్వజం
కొత్తపేట : కాపుల వల్లే తాము అధికారంలోకి వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఒక పక్క చెబుతూనే, మరోపక్క పథకం ప్రకారం కాపుల అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం వాడపాలెంలో కాపు నాయకులు పెదపూడి శ్రీనివాస్, బాపిరాజు సోదరుల స్వగృహంలో రామకృష్ణ గురువారం విలేకరులతో మాట్లాడారు. జీఓ నంబరు 30 ద్వారా కాపు విద్యార్థులకు గతంలో ప్రభుత్వం ఉపకార వేతనాలు అమలు చేయడానికి ముద్రగడ పద్మనాభం సాగించిన ఉద్యమమే కారణమన్నారు. తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆ ప్రయోజనాలను తుంగలో తొక్కిందన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు బీసీ హామీ ఇచ్చి గాలికొదిలేసినందునే ముద్రగడ మరలా ఉద్యమం చేపట్టవలసి వచ్చిందన్నారు. తమ డిమాండ్ సాధనకు కాపులు శాంతియుత పాదయాత్ర చేపడితే పోలీసు యంత్రాంగంతో కాపు నాయకులను హౌస్ అరెస్టులు చేయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని విమర్శించారు. పాదయాత్రకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే ప్రభుత్వం అడ్డుకుందని, కోడి పందేలు నిర్వహించరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అనుమతులు ఇచ్చిందని రామకృష్ణ గుర్తుచేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమో? నియంతృత్వమో?అర్థం కావడం లేదన్నారు. సంక్రాంతి ముసుగులో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సాక్షిగా కోడి పందేలు నిర్వహిస్తే లేని అభ్యంతరాలు, నిషేదాజ్ఞలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేపడుతున్న పాదయాత్రకు ఎందుకని ఆకుల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించింది వారా? మేమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాహక్కులను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. పాదయాత్రను అడ్డుకోవడం తగదన్నారు.కమిషన్ నియమించి, కాపులను బీసీల జాబితాలో చేర్చకుండా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. తుని ఘటనతో కాపులకు సంబంధం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబే అదే అంశాన్ని బూచిగా చూపి కాపుల పాదయాత్రను అడ్డుకోవడం ఆయన ద్వంద్వ వైఖరిని బయట పెడుతోందన్నారు. తమకు సహకరించే పార్టీలు, నాయకులతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని ,దానికి జగన్ ముద్ర వేయడం తగదని రామకృష్ణ అన్నారు. ఏదేమైనా బీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు సత్తిరాజు, బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, కాపు నాయకులు సాధనాల సత్యనారాయణ,మట్టా బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement