అనంతగిరి(వజ్రపుకొత్తూరు): ఇంటి యజమానులు నిత్యం పూటుగా మద్యం సేవించడం.. గ్రామంలో తగాదాలకు దిగడం.. ఇంటిలో భార్యభర్తల మధ్య ఎడబాట్లు.. ఆర్థిక కష్టాలతో నలిగిపోవడానికి కారణమైన మద్యం మహమ్మారిపై అనంతగిరి, వెంకటాపురం జంట గ్రామాల మహిళలు, యువత సమర శంఖం పూరించారు. మద్యం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. మద్య నిషేధానికి గ్రామ పెద్దలు అంగీకారం తెలపడంతో స్థానిక శివాలయం వద్ద సోమవా రం సమావేశమయ్యారు. నేటి నుంచి మద్యం విక్రయించడానికి వీలులేదంటూ గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు షాపు నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే మహిళలు పట్టుకుని వారిని పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. సారా విక్రయాలు జరిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని యువకు లు హెచ్చరించారు. మద్య నిషేధానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మరడ భాస్కరరావు, మాజీ సర్పంచ్ జి. జోగారావు, ఉంగ భుజింగరావు, అప్పారావు, ఎం.దుర్యోధనరావు, మహిళలు వాణిశ్రీ, విజయ, రాజులు తదితరులు పాల్గొన్నారు.