మద్యం ధరలకు రెక్కలు!
♦ ఐఎంఎల్, వైన్‌పై 10%, విదేశీ బ్రాండ్లపై 20% పెంపు?
♦ సర్కార్‌కు నెలాఖరులో ధరల నిర్ణాయక కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: మద్యం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా మూడేళ్ల క్రితం మద్యం ధరలను పెంచగా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. ఈ నేపథ్యంలో దేశీయ తయారీ మద్యం (ఐఎంఎల్), విదేశీ మద్యం ధరలను కూడా పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలను సమీక్షించి పెంచుతుండగా రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. 2015-16 సంవత్సరానికి మద్యం సరఫరా చేసేందుకు నిర్వహించిన టెండర్లలో కూడా దేశంలోని డిస్టిలరీలు అధిక ధరలనే కోట్ చేసినట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో మద్యం ధరలను పెంచేందుకు ఏర్పాటైన ధరల నిర్ణాయక ఉన్నత స్థాయి కమిటీ సమర్పించే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కమిటీ నెలాఖరులోగా నివేదిక ఇచ్చే అవకాశం ఉండగా నవంబర్ మొదటి వారంలో ధరలు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. తద్వారా డిస్టిలరీలతోపాటు కోట్లాది రూపాయల పెట్టుబడితో కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులు కూడా కొంత ఊరట పొందుతారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పెరిగే ధరలపై వ్యాట్ రూపంలో సర్కార్‌కు కూడా కొంత ఆదాయం సమకూర నుంది.
దేశీయ తయారీ మద్యాన్ని (ఐఎంఎల్) మద్యం తయారీ కంపెనీలు (డిస్టిలరీలు) టీఎస్‌బీసీఎల్‌కు విక్రయించే ధరలను బట్టి చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్‌గా నిర్ధారిస్తారు. ఇవి కాకుండా విదేశీ మద్యం అదనం. డిస్టిలరీలకు చీప్ లిక్కర్‌పై పెట్టెకు రూ. 450 లోపు, మీడియం లిక్కర్‌కు రూ. 750, ప్రీమియం లిక్కర్‌కు రూ. 750కన్నా ఎక్కువగా టీఎస్‌బీసీఎల్ చెల్లిస్తోంది. దీనికి వ్యాట్, కేంద్ర సుంకం తదిత రాలు కలిపి ఎంఆర్‌పీగా నిర్ణయిస్తోంది. ధరల పెంపుపై ఏర్పాటైన కమిటీ ప్రస్తుతం టీఎస్‌బీసీఎల్ డిస్టిలరీలకు చెల్లిస్తున్న మొత్తం, వ్యాట్, ఎంఆర్‌పీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు సమాచారం.
ఈ మేరకు ఇప్పుడు డిస్టిలరీలకు చీప్, మీడియం, ప్రీమియం లిక్కర్‌కు ఒక పెట్టెకు ఇస్తున్న మొత్తాన్ని 10 శాతం వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్ వినియోగం రాష్ట్రంలో తక్కువగా ఉన్నందున కొత్త వెరైటీ వైన్ బ్రాండ్‌లను రాష్ట్రానికి దిగుమతి చేయించి వాటి ధరలను కూడా 10 శాతం పెంచే యోచనలో ఉంది. విదేశీ మద్యం ధరలను మాత్రం 20 శాతం వరకు పెంచాలనుకుంటున్నట్లు తెలిసింది. పెరిగిన ధరలపై వ్యాట్‌ను అమలు చేయడం ద్వారా ఒక్కో ఫుల్‌బాటిల్‌పై బట్టి రూ. 20 నుంచి 50 వరకు ఎంఆర్‌పీ పెరిగే అవకాశం ఉంటుందని టీఎస్‌బీసీఎల్ వర్గాలు తెలిపాయి. ధరల పెంపుపై దసరా తరువాత నిర్ణయం తీసుకొని నవంబర్ మొదటి వారంలో అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ విషయాన్ని సచివాలయ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.