supply of alcohol
-
క్వార్టర్ పట్టు.. ఓటు కొట్టు!
సాక్షి, చీరాల టౌన్ (ప్రకాశం): మీ ఓట్లు మాకే వేయండి.. మీ సంక్షేమంతో పాటు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం..అంటూ టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఉదయం పూట గ్రామాలు, వార్డుల్లో మంతనాలు చేయించడంతో పాటు రాత్రి వేళల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఓటర్లను తాగుబోతులుగా తయారుచేసేందుకు తమ నాయకులతో కలిసి రాత్రి వేళల్లో ఇంటికో క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని డిమాండ్ చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని 33 వార్డులు, 24 గ్రామ పంచాయతీల్లోని ఓటర్లను ప్రలోభాలకు టీడీపీ నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపి మద్యం పంపకాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని వార్డుకు ముగ్గురు టీడీపీ ఇన్చార్జులను నియమించుకుని పగలు ఓటర్లతో మంతనాలు చేసుకుంటూ రాత్రి వేళల్లో మాత్రం పంపకాలకు తెరలేపుతున్నారు. ఇంటికి ఒక క్వార్టర్ పంపకాలు చేస్తున్నారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతకు ఓట్లు కొనవచ్చు, ఏ విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకోవాలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు గ్రామాలు, వార్డుల్లో ఇంటికి ఒక క్వార్టర్‌ను రాత్రివేళల్లో పంపకాలు చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని వార్డు స్థాయి టీడీపీ నేతలు ఓటర్లకు వల విసురుతున్నారంటే ఏవిధంగా ప్రలోభాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటుకు అమ్ముడు పోవాలా? చీరాల టౌన్: సార్వత్రిక ఎన్నికల ప్రచార జాతర ముగియక ముందే నియోజకవర్గంలో నోట్ల జాతర మొదలైంది. సార్వత్రిక పోరులో పోటీ నెలకొని ఉండటంతో నేతలు నోట్లు పంపిణీ చేస్తుండటంతో ఓటర్ల జేబులు కళకళలాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్కో ఓటు రూ. 2000 పైగా పలుకుతోంది. పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో, రూరల్ గ్రామాల్లో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బుల పంపిణీలో నిమగ్నమయ్యారు. ప్రచారాల ముగింపునకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో ఓ వైపు ప్రచారాలు చేస్తూనే మరో వైపు ఓటర్లకు నోట్లు పంపిణీలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ఓటుకు రూ.2,500 నుంచి రూ.3000 చొప్పున పంపిణీ జరిగింది. మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు, రూరల్ గ్రామాల్లో ఓటుకు నోటు పంపిణీతో హోరెత్తింది. రాత్రి వేళల్లో పొలీసుల హడావుడి ఉంటుందేమోనని ఈ సారి మాత్రం పట్టపగలే ఓటుకు నోట్లు పంచారు. వార్డుకు నాలుగు బృందాలు వెళ్లి నోట్లు పంపిణీ తంతు పూర్తిచేశారు. అయితే ఓటరు మాత్రం ఎవరికి ఓటు వేస్తారో చూడాల్సిందే. అలాగే టీడీపీ నేతలు ఇంటికో క్వార్టర్ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి నామినేషన్లు, ప్రచారాలకు కావాల్సిన అద్దె కార్యకర్తలకు నోటు, క్వార్టర్ మద్యాన్ని పంచారు. -
మద్యం ధరలకు రెక్కలు!
♦ ఐఎంఎల్, వైన్‌పై 10%, విదేశీ బ్రాండ్లపై 20% పెంపు? ♦ సర్కార్‌కు నెలాఖరులో ధరల నిర్ణాయక కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: మద్యం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా మూడేళ్ల క్రితం మద్యం ధరలను పెంచగా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. ఈ నేపథ్యంలో దేశీయ తయారీ మద్యం (ఐఎంఎల్), విదేశీ మద్యం ధరలను కూడా పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలను సమీక్షించి పెంచుతుండగా రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. 2015-16 సంవత్సరానికి మద్యం సరఫరా చేసేందుకు నిర్వహించిన టెండర్లలో కూడా దేశంలోని డిస్టిలరీలు అధిక ధరలనే కోట్ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో మద్యం ధరలను పెంచేందుకు ఏర్పాటైన ధరల నిర్ణాయక ఉన్నత స్థాయి కమిటీ సమర్పించే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కమిటీ నెలాఖరులోగా నివేదిక ఇచ్చే అవకాశం ఉండగా నవంబర్ మొదటి వారంలో ధరలు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. తద్వారా డిస్టిలరీలతోపాటు కోట్లాది రూపాయల పెట్టుబడితో కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులు కూడా కొంత ఊరట పొందుతారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పెరిగే ధరలపై వ్యాట్ రూపంలో సర్కార్‌కు కూడా కొంత ఆదాయం సమకూర నుంది. దేశీయ తయారీ మద్యాన్ని (ఐఎంఎల్) మద్యం తయారీ కంపెనీలు (డిస్టిలరీలు) టీఎస్‌బీసీఎల్‌కు విక్రయించే ధరలను బట్టి చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్‌గా నిర్ధారిస్తారు. ఇవి కాకుండా విదేశీ మద్యం అదనం. డిస్టిలరీలకు చీప్ లిక్కర్‌పై పెట్టెకు రూ. 450 లోపు, మీడియం లిక్కర్‌కు రూ. 750, ప్రీమియం లిక్కర్‌కు రూ. 750కన్నా ఎక్కువగా టీఎస్‌బీసీఎల్ చెల్లిస్తోంది. దీనికి వ్యాట్, కేంద్ర సుంకం తదిత రాలు కలిపి ఎంఆర్‌పీగా నిర్ణయిస్తోంది. ధరల పెంపుపై ఏర్పాటైన కమిటీ ప్రస్తుతం టీఎస్‌బీసీఎల్ డిస్టిలరీలకు చెల్లిస్తున్న మొత్తం, వ్యాట్, ఎంఆర్పీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పుడు డిస్టిలరీలకు చీప్, మీడియం, ప్రీమియం లిక్కర్‌కు ఒక పెట్టెకు ఇస్తున్న మొత్తాన్ని 10 శాతం వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్ వినియోగం రాష్ట్రంలో తక్కువగా ఉన్నందున కొత్త వెరైటీ వైన్ బ్రాండ్లను రాష్ట్రానికి దిగుమతి చేయించి వాటి ధరలను కూడా 10 శాతం పెంచే యోచనలో ఉంది. విదేశీ మద్యం ధరలను మాత్రం 20 శాతం వరకు పెంచాలనుకుంటున్నట్లు తెలిసింది. పెరిగిన ధరలపై వ్యాట్‌ను అమలు చేయడం ద్వారా ఒక్కో ఫుల్‌బాటిల్‌పై బట్టి రూ. 20 నుంచి 50 వరకు ఎంఆర్పీ పెరిగే అవకాశం ఉంటుందని టీఎస్‌బీసీఎల్ వర్గాలు తెలిపాయి. ధరల పెంపుపై దసరా తరువాత నిర్ణయం తీసుకొని నవంబర్ మొదటి వారంలో అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ విషయాన్ని సచివాలయ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. -
హోలీకి మద్యం ఓకే!
- డిపో మూసివేతతో నిలిచిన రూ.18కోట్ల సరుకు రవాణా - నేడు తెరుచుకోనున్న మద్యం డిపో - గురువారం నుంచి డీలర్లకు సరుకు సరఫరా సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎక్సైజ్ శాఖకు, మందుబాబులకు ఊరట లభించింది. ఆదాయ పన్ను చెల్లింపుల అంశంలో తలెత్తిన వివాదంతో రాష్ట్రంలోని మద్యం డిపోలకు తాళం పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని బ్రేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన డిపో రెండ్రోజులుగా మూతబడింది. ఫలితంగా డీలర్లకు మద్యం సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా డీలర్ల వద్ద స్టాకు నిండుకోవడం.. మరోవైపు హోలీ పండగ నేపథ్యంలో ఎక్సైజు శాఖకు భారీగా నష్టం తప్పదని భావించగా.. బుధవారం ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో ఊపిరిపీల్చుకున్నట్లైంది. దీంతో జిల్లాలోని మద్యం డీలర్ల వద్ద సరుకు అయిపోవడంతో గురువారం తిరిగి సరఫరా చేసేందుకు కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం విక్రయాలు జిల్లాలో నమోదవుతున్నాయి. సగటున రాష్ట్ర ఆదాయంలో 30శాతం రెవెన్యూ జిల్లానుంచే ఖజానాకు చేరుతోంది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా డిపోకు తాళం పడడంతో సరుకు డిపో గేటు దాటలేదు. ప్రస్తుతం జిల్లాలో 350 వరకు మద్యం దుకాణాలున్నాయి. ఇవికాకుండా మరో 250 బార్లు నడుస్తున్నాయి. వీటిద్వారా నెలకు సగటున రూ.165 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమఅవుతోంది. ఈ లెక్కన రోజుకు రూ.6 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. తాజాగా ఆదాయపుపన్ను చెల్లింపుల విషయమై మద్యం డిపో మూతబడింది. ఫలితంగా మూడురోజులుగా జిల్లాలో దాదాపు రూ.18 కోట్ల విలువైన స్టాకు సరఫరా నిలిచిపోయింది. తాజాగా డిపో తెరిచేందుకు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విక్రయాలు జరిగినప్పటికీ వాటివల్ల వచ్చే నగదుపై మాత్రం ఆంక్షలు పెట్టింది. ఈనెల 10న చేపట్టే విచారణ అనంతర పరిణామాలతో ముడిపెట్టింది. -
మందు బందు
నేటి నుంచి గొల్లపూడి, గుడివాడ డిపోల నుంచి మద్యం సరఫరా నిలిపివేత 2013 వరకు ఐటీ శాఖకు రూ. 77 కోట్ల బకాయి రెండు డిపోల్లో లక్ష కేసుల నిల్వలు ధరలకు మళ్లీ రెక్కలు విజయవాడ : జిల్లాలో మంగళవారం నుంచి మద్యం సరఫరాకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడనుంది. బేవరేజ్‌ల ద్వారా మద్యం సరఫరా నిలిచిపోనుంది. గుడివాడ, గొల్లపూడి డిపోలు ఆదాయ పన్ను శాఖకు భారీగా బకాయిలు పడ్డాయి. వీటిని చెల్లించే వరకు విక్రయాలు నిలిపివేయాలని ఉత్తర్వులు అందడంతో మంగళవారం ఆపేస్తారు. ఫలితంగా జిల్లాలో మరో వారం రోజుల తర్వాత మద్యం కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు ఇప్పటికే మద్యం ధరలు మళ్లీ పెంచి అధిక వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐటీ వర్సెస్ ఎక్సైజ్.. ఆదాయ పన్ను శాఖ, ఎక్సైజ్ శాఖకు మద్యం ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో కొంత వివాదం జరుగుతోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ 2013 వరకు ఐటీ శాఖకు పన్ను చెల్లించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్త బకాయి రూ. 8 వేల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు తీసుకొచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మద్యం డిపోల నుంచి సరఫరా నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో కూడా 2013 వరకు రూ. 77 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో రెండు డిపోల నుంచి వైన్‌షాపులు, బార్లకు మద్యం నిల్వలు పంపకుండా నిలిపివేయాలని ఆదాయ పన్ను శాఖ అధికారుల నుంచి ఉత్తర్వులందాయి. ఈ క్రమంలో రెండు డిపోల మేనేజర్లకు గత శనివారం ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. రూ.15 కోట్ల నిల్వలు విజయవాడ డివిజనల్ పరధిలోని వైన్‌షాపులు, బార్లకు గొల్లపూడి డిపో నుంచి, మచిలీపట్నం డివిజన్ పరిధిలోని వైన్ షాపులు, బార్లకు గుడివాడ డిపో నుంచి మద్యం నిల్వలు ప్రతినెలా సరఫరా చేస్తారు. జిల్లాలోని షాపులకు మాత్రమే రెండు డిపోల ద్వారా సరఫరా జరుగుతుంది. ఈనెలకు సంబంధించి స్టాక్‌ను గతనెల 21 నుంచే వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లా కోటా 2.3 లక్షల కేసుల మద్యం విక్రయాలు ఇప్పటికే పూర్తికావడంతో సరఫరా చేసేశారు. జిల్లాలో నెలకు రూ.100 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరుగుతాయి. వీటిలో 2.2 లక్షల కేసులు మద్యం కాగా, లక్ష కేసుల బీరు అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలోని రెండు డిపోల్లో కేవలం లక్ష కేసుల మద్యం నిల్వలే ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.15 కోట్లుగా ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వచ్చే వరకు డిపోల నుంచి పంపిణీ నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.