- డిపో మూసివేతతో నిలిచిన రూ.18కోట్ల సరుకు రవాణా
- నేడు తెరుచుకోనున్న మద్యం డిపో
- గురువారం నుంచి డీలర్లకు సరుకు సరఫరా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎక్సైజ్ శాఖకు, మందుబాబులకు ఊరట లభించింది. ఆదాయ పన్ను చెల్లింపుల అంశంలో తలెత్తిన వివాదంతో రాష్ట్రంలోని మద్యం డిపోలకు తాళం పడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జిల్లాలోని బ్రేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన డిపో రెండ్రోజులుగా మూతబడింది. ఫలితంగా డీలర్లకు మద్యం సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా డీలర్ల వద్ద స్టాకు నిండుకోవడం.. మరోవైపు హోలీ పండగ నేపథ్యంలో ఎక్సైజు శాఖకు భారీగా నష్టం తప్పదని భావించగా.. బుధవారం ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో ఊపిరిపీల్చుకున్నట్లైంది.
దీంతో జిల్లాలోని మద్యం డీలర్ల వద్ద సరుకు అయిపోవడంతో గురువారం తిరిగి సరఫరా చేసేందుకు కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం విక్రయాలు జిల్లాలో నమోదవుతున్నాయి. సగటున రాష్ట్ర ఆదాయంలో 30శాతం రెవెన్యూ జిల్లానుంచే ఖజానాకు చేరుతోంది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా డిపోకు తాళం పడడంతో సరుకు డిపో గేటు దాటలేదు. ప్రస్తుతం జిల్లాలో 350 వరకు మద్యం దుకాణాలున్నాయి. ఇవికాకుండా మరో 250 బార్లు నడుస్తున్నాయి.
వీటిద్వారా నెలకు సగటున రూ.165 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమఅవుతోంది. ఈ లెక్కన రోజుకు రూ.6 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. తాజాగా ఆదాయపుపన్ను చెల్లింపుల విషయమై మద్యం డిపో మూతబడింది. ఫలితంగా మూడురోజులుగా జిల్లాలో దాదాపు రూ.18 కోట్ల విలువైన స్టాకు సరఫరా నిలిచిపోయింది. తాజాగా డిపో తెరిచేందుకు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విక్రయాలు జరిగినప్పటికీ వాటివల్ల వచ్చే నగదుపై మాత్రం ఆంక్షలు పెట్టింది. ఈనెల 10న చేపట్టే విచారణ అనంతర పరిణామాలతో ముడిపెట్టింది.
హోలీకి మద్యం ఓకే!
Published Wed, Mar 4 2015 11:41 PM | Last Updated on Thu, Sep 27 2018 4:27 PM
Advertisement