అంతా చట్ట ప్రకారమే
అంతా చట్ట ప్రకారమే
Published Sat, Sep 9 2017 10:19 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM
ప్యాకేజీలో అర్హుల వివరాలు పక్కా
అవార్డు జరిగిన తేదీనే కటాఫ్
తప్పుడు పత్రాలతో ప్యాకేజీ పొందితే శిక్షార్హులే
ప్రతి ఫిర్యాదూ నమోదు
అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై జేసీ కోటేశ్వరరావు
ఏలూరు (మెట్రో):
ఆందోళనలు... ఆత్మహత్యా యత్నాలు... అలజడులు.. ఇవీ గత నెల రోజులుగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కనిపిస్తున్న సంఘటనలు. ఒక వైపు ప్యాకేజీ సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో పడి కొందరు ఆనంద పడుతుంటే, తమకు రావాల్సిన ప్యాకేజీ రాలేదని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత ఇన్‌ఛార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పులిపాటి కోటేశ్వరరావు ’సాక్షి’తో మాట్లాడారు.
భూముల సర్వేపై ః
పోలవరం ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాలు భూములు ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్ ఆధారంగానే ముంపు ప్రాంతాలను గుర్తించాం. మ్యాప్‌కు అనుగుణంగానే తాము వ్యవహరించాలి తప్ప కనీసం ఒక్క అడుగు కూడా అధికంగా సేకరించేందుకు వీల్లేదు. చాలామంది తమ భూములు ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉన్నాయని చెబుతున్నారు. అయితే నీటిపారుదల శాఖ అంచనాల మేరకు తాము ముంపు ప్రాంతాలను గుర్తించాం.
ఆర్ అండ్ ఆర్ చట్టం వివరిస్తూ ః
చట్టంలో ఏదైతే పొందుపరిచారో అదే అమలు చేయాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిమీదనైనా చర్యలు తప్పవు. చట్టం బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిది. చట్టం ప్రకారమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చేశాం. 2013 భూసేకరణ చట్టం 3 సెక్షన్ సి 2 ప్రకారం నిర్వాసితులకు (నిర్వాసిత గ్రామాల్లో 3 సంవత్సరాలుగా నివాసం ఉంటూ, ముంపు ప్రాంతాలపైనే, ముంపునకు గురయ్యే పొలాలు, స్థలాలపై ఆధారపడి జీవిస్తేనే) తప్పక పరిహారాన్ని అందిస్తాం. చట్టంలోని చాప్టర్ 12లోని 84 (1) ప్రకారం అనర్హులైన వారు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పొందినా, అధికారులను మోసం చేసినా వారిపైనా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా చేసిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాను కూడా విధించాలని చట్టంలో పొందు పరిచారు.
అన్యాయంపై ః
ఎవరివల్లో నిర్వాసితులు అన్యాయానికి గురయ్యారని చెప్పడానికి అవకాశం లేదు. ఒక రేషన్‌డీలర్ ద్వారా కాని, ఒక వీఆర్‌ఓ ద్వారా కాని అర్హులను అనర్హులుగా మార్చే అవకాశం లేదు. రేషన్ డీలరు, వీఆర్‌ఓ వంటి వారి ద్వారా పొందాల్సిన డేటా తమ వద్దే ఉంటుంది. ఈ విషయంలో నిర్వాసితులు అపోహలకు గురి కావద్దు.
ఇదీ కటాఫ్ తేదీ ః
అవార్డు పాస్ చేసిన జూన్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు కటాఫ్‌గా నిర్ణయించాం. దీనికి మించి ఒక్క రోజు తగ్గినా కుటుంబ ప్యాకేజీ రాదు.
ఫిర్యాదులు ఇక పక్కాః
ప్రతి ఫిర్యాదునూ నమోదు చేయిస్తున్నాం. పూర్తిస్థాయిలో, లోతుగా విచారణ చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. విచారణకు ఎన్నిరోజులు సమయం పట్టినా న్యాయం చేసే తీరుతాం. విచారణలో ఫిర్యాదు దారులనూ ప్రశ్నించి నిజాలు తేలుస్తాం.
Advertisement
Advertisement