
ఉప ఎన్నికలకు మోగిన నగారా
గుడివాడ : జిల్లాలోని గుడి వాడ, పెడన మున్సిపాలిటీలు, విజయవాడ కార్పొరేషన్‌లో ఒక డివిజన్‌లో కార్పొరేటర్ స్థానానికి ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహిం చేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గుడివాడ 19వ వార్డు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 19వ వార్డు కౌన్సిలర్ గణపతి లక్ష్మ ణరావు మృతితో ఏర్పడిన ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ, ఏప్రిల్ 9న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు.
పెడన 20 వార్డుకు...
పెడన: పెడన మున్సిపాలిటీలోని 20వ వార్డు ఉప ఎన్నిక ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తెలిపారు. ఈమేరకు గురువారం ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పట్టణంలోని 20 వార్డు కౌన్సిలర్ యర్రా శేషగిరిరావు 2015 జూన్‌లో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడిందని తెలిపారు.
11వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి...
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్‌లో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ అనారోగ్యతో 2015లో మృతి చెందారు. దీంతో ఆ డివిజన్లో ఖాళీ ఏర్పడింది. తాజాగా ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 9 వ తేదీ పోలింగ్ జరుగుతుందని, 11న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, గుడివాడ డివిజన్ పంచాయతీ అధికారి విక్టర్ తెలిపారు.