కర్నూలు(టౌన్): నెలాఖరులోపు హౌస్‌ఫర్ ఆల్ సర్వే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆశాఖ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో మొదటి దశలో 18,618 ఇళ్లు మంజూరు అయ్యాయని, లబ్ధిదారుల ఎంపిక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పేరుతో జిల్లాలో 1.89 లక్షల మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్కను జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలను జిల్లాలో 13, 733 ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చేనెల 1 వ తేదీ నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ఈ– ఆఫీసు పాలన అమలు చేయాలన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, పట్టణ ప్రణాళిక విభాగం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి, ఎమ్మిగనూర్ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు.