నేత్రపర్వం..అలుకోత్సవం
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నృసింహుడి అలుకోత్సవం ఆదివారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగాంతంలో నారసింహుడు అశ్వ వాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడం కోసమే స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారని వేద పండితులు వివరించారు. యాగశాలలో నిత్యహోమం నిర్వహించిన తర్వాత విశేషాలంకరణ అనంతరం శ్రీవారు నృసింహాలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భక్తులు ‘ శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ గోవింద నామస్మరణ చేశారు.
ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి దొడ్డా వెంకటేశ్వరరెడ్డి దంపతులు స్వామివారికి సాంప్రదాయ బద్దంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అలుకోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే అలుకోత్సవానికి మాత్రం ఆనవాయితీ ప్రకారం ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, కమిటీ సభ్యులు ఇద్దే రఘునాథరెడ్డి, మోపూరిశెట్టి చంద్రశేఖర్, సురగాని రవికుమార్, రొడ్డారపు నాగరాజు, తేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.