narasimhudu
-
బ్రహ్మోత్సవాల తాత్కాలిక హుండీల లెక్కింపు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలను మంగళవారం లెక్కించారు. వాటి ద్వారా స్వామి వారికి రూ.16,89,484 లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామతులసి, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
కనుల పండువగా పుష్పయాగోత్సవం
– ముగిసిన నృసింహుని బ్రహ్మోత్సవాలు కదిరి : పక్షంరోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణలో జరిగిన పుష్పయాగోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవం కనుల పండువగా, అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచభూతాలు, దేవతామూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని.. వారి వారి లోకాలకు సాగనంపేందుకు జరిగిందే ఈ పుష్పయాగోత్సవమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి తెలియజేశారు. సోమవారం నాటి తీర్థవాది ఉత్సవం ముగియగానే ఆలయం తలుపులు మూసివేసిన విషయం తెలిసిందే. తిరిగి మంగళవారం వేకువజామునే ఆలయ ద్వారాలు తెరిచి మహాసంప్రోక్షణ గావించారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు ఆలయంలో శ్రీవారి సర్వదర్శనభాగ్యం కలిగించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రంగమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. యాగోత్సవానికి ఉభయదారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ, పూల కుసుమకుమారి కుటుంబసభ్యులు వ్యవహరించినట్లు ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు తెలియజేశారు. బెంగుళూరుకు చెందిన భక్తుడు బీఎన్ మూర్తి పుష్పయాగోత్సవానికి కావాల్సిన వివిధ రకాల పుష్పాలు తీసుకురావడంతో పాటు పెద్ద మొత్తంలో బాణసంచా తెచ్చి ఆలయ ప్రాంగణంలో పేల్చి భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మోపూరి చంద్రశేఖర్, కరె నాగరాజు, రొడ్డారపు నాగరాజు, ఇద్దె రఘునాథరెడ్డి, డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం..అలుకోత్సవం
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నృసింహుడి అలుకోత్సవం ఆదివారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగాంతంలో నారసింహుడు అశ్వ వాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడం కోసమే స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారని వేద పండితులు వివరించారు. యాగశాలలో నిత్యహోమం నిర్వహించిన తర్వాత విశేషాలంకరణ అనంతరం శ్రీవారు నృసింహాలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భక్తులు ‘ శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ గోవింద నామస్మరణ చేశారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి దొడ్డా వెంకటేశ్వరరెడ్డి దంపతులు స్వామివారికి సాంప్రదాయ బద్దంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అలుకోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే అలుకోత్సవానికి మాత్రం ఆనవాయితీ ప్రకారం ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, కమిటీ సభ్యులు ఇద్దే రఘునాథరెడ్డి, మోపూరిశెట్టి చంద్రశేఖర్, సురగాని రవికుమార్, రొడ్డారపు నాగరాజు, తేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నమో నారసింహా..
- అంగరంగ వైభవంగా ఖాద్రీ నృసింహుని బ్రహ్మ రథోత్సవం - భక్తజన సంద్రమైన కదిరి పట్టణం - శ్రీవారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు - కేవలం 4 గంటల్లో యథాస్థానం చేరిన బ్రహ్మరథం కదిరి : శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలతో పాటు కర్ణాటక నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కదిరి పట్టణమంతా భక్తులతో నిండిపోయింది. వారి గోవింద నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీ నారసింహుడు తిరు వీధుల గుండా విహరించేందుకు దేవతలు ప్రతిరోజు ఒక్కో వాహనాన్ని పంపుతారు. బ్రహ్మ రథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మ దేవుడే రథాన్ని నడుపుతారని భక్తుల నమ్మకం. బ్రహ్మ రథం కదిలేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు నిర్ణయించిన శుభసమయం ఉదయం 7.29 గంటలు కాగా, 8.02 గంటలకు తేరును కదిలించారు. ఆ సమయంలో తిరువీధులు భక్తుల గోవింద నామ స్మరణతో మార్మోగి పోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తేరు యథాస్థానం చేరుకోవడానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకే యథాస్థానం చేరుకుంది. ఈసారి తేరు మోకులు కొత్తవి కావడం, అందులోనూ అవి పొడవు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది భక్తులకు రథంలాగే భాగ్యం కల్గింది. అయితే.. తేరు వేగాన్ని అదుపు చేయడానికి తెడ్లు వేసేవారు ఈసారి బాగానే శ్రమించారు. అయినప్పటికీ పలుచోట్ల అదుపుతప్పి తిరువీధుల్లోని ఇళ్లతో పాటు విద్యుత్ స్తంభాలను తాకింది. ఉదయాన్నే ఆలయ అర్చకులు తేరు దగ్గర బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, జెడ్పీ చైర్మన్ చమన్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఆర్డీఓ వెంకటేశు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు స్వామివారి బ్రహ్మ రథాన్ని కొంత దూరం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. తిరు వీధుల అక్రమణల కారణంగా రథం లాగేందుకు భక్తులు బాగా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకొని రథంపైకి దవణం, మిరియాలు చల్లేందుకు తిరువీధుల్లోని మిద్దెలపై వేచిఉన్నారు. ఇలా చేస్తే పాప విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియజేశారు. అలాగే భక్తులతో గోవిందనామ స్మరణ చేయించారు. ముందురోజు అంటే శుక్రవారం రాత్రి స్వామి వారు ఐరావతంపై తిరు వీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయం చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున శుభ ముహూర్తాన రథారోహణం గావించారు. ఆనవాయితీగా వస్తున్న మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి వెనుకవైపు నుంచి మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తుంటే వేలాది మంది భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. రథం ముందు వెళ్తుంటే వెనుక భాగాన ఫైర్ ఇంజన్‌తో పాటు ప్రథమ చికిత్సకు సంబంధించిన అంబులెన్స్ వాహనాలు వెళ్లాయి. గాయపడిన భక్తులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేస్తూ ముందుకు సాగిపోయారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారని అంచనా. రథం లాగే భక్తులకు దాతలు మంచినీటి ప్యాకెట్లను అందించారు. పట్టణంలో అడుగడుగునా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మ రథోత్సవానికి ఉభయదారులుగా కరె నాగరాజు, సుందర రాజు, పాండు రంగయ్య, అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. రథోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డీఎస్పీ ఎన్.వెంకటరామాంజనేయులు నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. 500 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. -
నేడు అశ్వవాహనంపై నారసింహుడి దర్శనం
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఖాద్రీ లక్ష్మీనారసింహుడు భక్తులకు అశ్వవాహనంపై తిరువీధుల్లో దర్శనమిస్తారు. యాగశాలలో నిత్యహోమం గావించి శ్రీవారిని విశేషంగా అలంకరించి సాయం సంధ్యవేళలో ఆలయం పక్కనే ఉన్న అలుకోత్సవ మండపం వద్దకు చేరుకుంటారు. అక్కడ అలుకోత్సవం విశిష్టతను పండితులు భక్తులకు వివరిస్తారు. పక్షం రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఉత్సవానికి ఉభయదారులుంటారు. కానీ స్వామివారి అలుకోత్సవానికి మాత్రం ఎవరైతే ఆలయ సహాయ కమిషనర్‌గా ఉంటారో వారే ఉభయదారులుగా వ్యవహరిస్తారు. ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి దంపతులే ఈసారి శ్రీవారికి సంప్రదాయ బద్ధంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. -
మోహినీ అవతారంలో నారసింహుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బు«ధవారం రాత్రి మోహినీ అవతారమెత్తారు. తమ ఇలవేల్పు నృసింహుని కనులారా దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘మోహినీ అవతారంలో స్వామి వారి కుచ్చుల వాలుజడ భలే ఉందే...’ అంటూ భక్తులు ఒకరినొకరు చెప్పుకున్నారు. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తాడని భక్తుల విశ్వాసం. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి, అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు ఈ అవతారమెత్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వయ్యారాలు ఒలకపోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. ధగధగా మెరిసే పట్టు చీరలో అందరినీ అకట్టుకునే స్వామి వారిని గుభాళించే కదిరి మల్లెలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం బ్రహ్మకుమారీలు చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నరసింహావతారాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. ఆర్డీఓ వెంకటేశు, ఈఓ వెంకటేశ్వరరెడ్డిలు జ్యోతి వెలిగించి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. నేడు పట్టణమంతా ఊరేగనున్న శ్రీవారు : తిరు వీధుల దర్శనానంతరం శ్రీవారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిచ్చారు. అదేవిధంగా గురువారం పగలు సైతం పట్టణమంతా తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని ప్రజా గరుడ సేవతో మళ్లీ తిరువీధుల్లో దర్శనమిస్తారు. మోహినీ ఉత్సవ ఉభయదారులుగా కోటా వెంకటక్రిష్ణమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మెన్ నరేంద్రబాబు తెలిపారు. డీఎస్పీ వెంకటరామాంజనేయులు, సీఐ శ్రీనివాసులుతోపాటు డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నరసింహుని సేవలో మంత్రి మాణిక్యాలరావు
వేదాద్రి (పెనుగంచిప్రోలు) : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పి.మాణిక్యాలరావు స్థానిక కృష్ణా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతర పుష్కర ఘాట్లను సందర్శించి భక్తులతో సౌకర్యాలపై ప్రశ్నించారు. బీజేపీ నాయకులు నోముల రఘు, మన్నే శ్రీనివాసరావు, కీసర రాంబాబు పాల్గొన్నారు. -
పీహెచ్డీ@ 78
సీతంపేట, న్యూస్‌లైన్ : ఎవరైనా పదవీ విరమణ తర్వాత ఏంచేస్తారు? రామాకృష్ణా అంటూ కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన గ్రంథాలను చదువుతుంటారు. లేదంటే ఏదో వ్యాపకం పెట్టుకుంటారు. కానీ ఆయన అలా చేయలేదు. దాదాపు ఎనిమిది పదుల వయసులోనూ చదువుపై మమకారం పెంచుకున్నారు. విశ్రాంతి తీసుకునే ప్రాయంలో డాక్టరేట్ కోసం తపించారు. ఎన్నో ఒడుదుడుకులెదురైనా అధిగమించారు. అనుకున్నది సాధించారు. డాక్టర్ నరసింహారావు అయ్యారు. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లో ఉంటున్న ఎన్.డి.నరసింహారావు వయసు 78 ఏళ్లు. సెంట్రల్ హిందీట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(ఢిల్లీ)లోఅసిస్టెంట్ డెరైక్టర్‌గా పదవీ విరమణ చేసి 20 ఏళ్ళయింది. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి వివిధ హోదాల్లో 24 ఏళ్ళు పనిచేశారు. ఈ క్రమంలో ఎందరో విద్యార్థులు రాసిన థీసిస్ చదివారు. తానూ బాగా థీసిస్ రాయగలనన్న నమ్మకంతో 2010లో పీహెచ్డీ ఎంట్రన్స్ రాసి అర్హత సాధించారు. ప్రొఫెసర్ ఆర్.డి.శర్మ పర్యవేక్షణలో ‘హిందీ తెలుగు దళిత ఆత్మ కథల తులనాత్మక అధ్యయనం’ అనే అంశపై పరిశోధన చేసి డిసెంబర్ 2011లో 650 పేజీల థీసిస్ సమర్పించారు. ఈనెల 5న దక్షిణ భారత హిందీ ప్రచార సభ నరసింహారావుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. థీసిస్ సమర్పించే గడువు తేదీకి నెల రోజుల ముందు తన భార్య చనిపోయింది. అంతటి దుఃఖంలోనూ చివరి నెల రోజులు, రోజుకు 20 గంటలు శ్రమించి థీసిస్ సమర్పించారు. కృషి, పట్టుదల, సంకల్పబలం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు నరసింహారావు. మంచి ఆరోగ్యపు అలవాట్ల వల్లే 78 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారాయన.